ఆ టీడీపీ నేత వైసీపీలో చేరిపోయారు

Update: 2016-02-17 07:45 GMT
    వైసీపీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో వచ్చి చేరుతారని... బడ్జెట్ సమావేశాలకు ముందే అది జరిగి తీరుతుందని ఏపీ మంత్రులు నమ్మకంగా చెబుతున్న వేళ టీడీపీ కీలక నేత ఒకరు నేరుగా వెళ్లి జగన్ ఇంట్లోనే ఆయన సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. అవును.... అంతమంది వస్తారు.. ఇంతమంది వస్తారు అంటూ టీడీపీ నేతలు జబ్బలు చరుచుకోవడమే తప్ప ఇటీవల వైసీపీ నుంచి ఎవరినీ తీసుకొచ్చింది లేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వస్తామంటున్నా ఆయన్ను చేర్చుకోవడానికి మార్గం సుగమం చేసుకోలేకపోతున్నారు.

అలాంటిది పది మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరుతారని చెబుతున్న సమయంలో నెల్లూరులో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి సోదరుడు ఆనం విజయకుమార్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఇంతకాలం వివేకాకు ఆయన కుడిభుజంగా ఉండేవారు...వివేకా ప్రతి గెలుపులోనూ విజయకుమార్ దే ప్రధాన పాత్ర. అలాంటి కీలక నేత వైసీపీలోకి చేరడంతో టీడీపీ మాటలే తప్ప చేతలు లేవని... ఆయన్ను వైసీపీలోకి వెళ్లకుండా ఆపలేకపోయారని, అలాంటప్పుడు వైసీపీ నేతలను ఇంకెలా చేర్చుకోగలరన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎన్నికల వ్యవహారాల్లో మంచి దిట్టగా పేరు తెచ్చుకున్నారు. వివేకా వెనుకే ఉంటూ అన్నీ చక్కబెట్టేవారు. ఇటీవల వివేకా, రామనారాయణరెడ్డిలు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరినప్పుడు వారితో పాటే ఆయనా టీడీపీలోకి వెళ్లారు.అయితే... ఇకపై సొంతంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఆయన వైసీపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆయన వైసీపీలో వెళ్తున్నట్లు కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్నా.. ఆయన వారితో టచ్ లో ఉంటున్నా కూడా టీడీపీ నేతలు ఆపలేకపోయారు. టీడీపీకి బలమవుతారని భావించి తీసుకొచ్చిన ఆనం బ్రదర్స్ గుట్టుమట్లన్నీ తెలిసిన విజయకుమార్ వైసీపీలోకి వెళ్లడం నెల్లూరు టీడీపీకి ఎంతయినా నష్టమే.
Tags:    

Similar News