యూపీలో ఏం జరుగుతోంది?

Update: 2016-10-26 12:03 GMT
సమాజ్ వాది పార్టీలో సంక్షోభం తారాస్థాయికి చేరడం... ముఖ్యమంత్రి అఖిలేశ్ ఈరోజు గవర్నరు రాంనాయక్ ను కలవడం రాజకీయంగా మరింత చర్చకు దారితీస్తున్నాయి.  అఖిలేశ్ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన పార్టీ  ఎస్పీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ములాయం సోదరుడు అయిన శివపాల్ యాదవ్ తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు ఇంటికి ఉన్న నేమ్ ప్లేటును కూడా తీయించేశారు. అంతేకాదు.. ములాయం చెబితే తప్ప తాను మళ్లీ మంత్రివర్గంలో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.  మొన్న శివపాల్ తో పాటు నలుగురు మంత్రులను అఖిలేష్ తొలగించడం.. ఆ తరువాత మళ్లీ పదవులు ఇవ్వడం తెలసిందే. అయితే... మళ్లీ కేబినెట్లోకి తీసుకున్నా వారు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.. ఈ క్రమంలో ములాయం చెబితే తప్ప తాను మంత్రి పదవిచేపట్టబోనని శివపాల్ చెప్పడం రాజకీయ వేడి పుట్టిస్తోంది. మరోవైపు  మంత్రివర్గంలోని ఒక మంత్రిపై ములాయం ఆరేళ్ల బహిష్కరణ వేటు వేశారు.
    
కాగా గవర్నరును కలిసిన అఖిలేశ్... అది మర్యాదపూర్వక భేటీ అనిచెబుతున్నా తాజా పరిస్థితులపై ఆయనతో చర్చించి ఉంటారన్నది ఖాయంగా కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో గవర్నర్ రాం నాయక్  తో అఖిలేష్ భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత కాసేపటికే గవర్నర్ ముంబై వెళ్లనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.  కాగా నిన్న సాయంత్రం పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పార్టీ - కుటుంబం - తమ బలం - బలగం అన్నీ ఒక్కటిగానే ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా, ఆ సమావేశానికి అఖిలేష్ హాజరు కాలేదు. తాజాగా ఈ రోజు ఆయన గవర్నరును కలిశారు.
    
మరికొద్ది నెలల్లోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వేలు ఇప్పటికే చెబుతున్నాయి. బీఎస్పీ రెండో స్థానంలోను, సమాజ్ వాదీ పార్టీ మూడో స్థానంలోను ఉంటాయని అన్నారు. ఆ నేపథ్యంలో... తాజా రాజకీయ పరిణామాల కారణంగా అఖిలేశ్ ముందస్తు ఆలోచనలతో ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News