కర్నూలుకు కొత్త కళ.. విమానాల రిపేర్ల సెంటర్

Update: 2020-11-23 05:15 GMT
కర్నూలు నగరం దశ తిరిగేలా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.  ఇప్పటికే కర్నూలు సమీపంలోని ఓర్వకల్లులో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. త్వరలోనే వాణిజ్య సేవల్ని అందించేందుకు సిద్ధమవుతున్న ఈ ఎయిర్ పోర్టుకు అనుబంధంగా విమానాల్ని రిపేర్లు చేయటం.. మొయింటైనెన్స్ చేసేందుకు వీలైన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతుల్ని త్వరలోనే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేయనున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు విమానాల మొయింటైనెన్స్ కోసం.. రిపేర్ల కోసం అయితే బెంగళూరు.. లేదంటే హైదరాబాద్ కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో.. అక్కడ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ రెండు విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు భారీగా ఉండటంతో.. క్లియరెన్స్ త్వరగా లభించటం లేదు. దీనికి తోడు నిర్వహణ ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు విమానాశ్రయంలో మొంయింటెనెన్స్.. రిపేర్లకు అవసరమైన కేంద్రాన్ని ఏర్పాటు చేయటం ద్వారా పెద్ద ఎత్తున విమానాల్ని ఆకర్షించే వీలుందంటున్నారు.

త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలు షురూ చేయనున్నకర్నూలు ఎయిర్ పోర్టులో ఇప్పటికిప్పుడు విమాన సర్వీసులు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. దీంతో.. రిపేర్లు.. మొయింటెనెన్స్ కు త్వరగా క్లియరెన్సు లభించటంతో పాటు.. తక్కువ ధరకే సేవలు లభించే వీలు ఉంటుంది. దీంతో.. కర్నూలు విమాన సర్వీసు సెంటర్ కు పేరు ప్రఖ్యాతులు రావటమే కాదు.. కర్నూలు దశ మారటానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Tags:    

Similar News