తమ ఆరుగురు పిల్లల్ని చంపమంటున్న పేరెంట్స్‌

Update: 2015-05-25 16:17 GMT
ఏ తల్లిదండ్రులకు రాని కష్టం వచ్చింది. ఏళ్లకు ఏళ్లు అపురూపంగా పెంచుకున్న పిల్లల్ని.. చంపేయమని కోరుతున్నారు ఆ తల్లిదండ్రులు. అది కూడా ఒకరో.. ఇద్దరో కాదు.. ఏకంగా ఆరుగురు పిల్లల్ని. కన్నబిడ్డల్ని చంపేసుకునే కర్కశమైన హృదయమేం కాదు. కానీ.. పరిస్థితులు వారిని అలా చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి.

తమ పిల్లలు పడుతున్న అనారోగ్యానికి చికిత్స చేయించలేక.. వారు పడే బాధలు చూడలేక విపరీతమైన వేదనతో వారు భారతరాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక నిరుపేద తల్లిదండ్రుల వేదన ఇప్పుడు అందరిని కదిలించేస్తుంది. ఆగ్రాలోని గాలిబ్‌పుర ప్రాంతానికి చెందిన నజీర్‌ అనే వ్యక్తి మిఠాయి దుకాణంలో పని చేస్తుంటాడు.

అతనికి మొత్తం ఆరుగురు పిల్లలు.. పెద్దవాడికి పద్దెనిమిదేళ్లు అయితే రెండోవాడికి పదహారేళ్లు. ఆ తర్వాత వాళ్లు.. 12.. 10.. 7.. 7 ఏళ్లు. అయితే.. వీరంతా నాడీ సంబంధమైన వ్యాధితో బాధ పడుతున్నారు. వారికి వైద్యం చేయించే స్తోమత లేకపోవటంతో.. వారినేం చేయాలో అర్థం కావటం లేదు. సరైన వైద్యం లేక వారు పడుతున్న బాధ ఈ పేద పేరెంట్స్‌ చూడలేకపోతున్నారు.

డబ్బుల్లేక.. వైద్యం చేయించలేక.. అవస్థలు పడుతున్న వారు.. తమ పిల్లల్ని మందులిచ్చి చంపేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు.. మరో లేఖను యూపీ ముఖ్యమంత్రికి రాశారు. ఆరుగురు పిల్లలున్నా.. అందరూ అనారోగ్యం పాలు కావటం.. ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోతో కదూ.

Tags:    

Similar News