‘బిగ్ బాస్’ పేరు అంతలా వాడేయటమే కొంప ముంచిందా?

Update: 2020-09-24 07:00 GMT
మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేయటమే కాదు.. అతగాడి ఆక్రమ ఆస్తుల లెక్క పోలీసు శాఖలో ఇప్పుడు షాకింగ్ గా మారింది. తాను పని చేసిన ప్రాంతాల్లో బుద్దిగా ఉన్నట్లుగా వ్యవహరించే ఆయన.. లోగుట్టుగా చేసే రచ్చ అంతా ఇంతా కాదన్నట్లు చెబుతారు. గుట్టుచప్పుడు కాకుండా కోట్లాది రూపాయిల ఆస్తుల్ని చేజిక్కించుకోవటం.. తెలిసిన వారిని బినామీలుగా నియమించుకోవటంలో ఆయనకు ఆయనే సాటిగా చెబుతారు. మరింత జాగ్రత్తగా ఉండే ఈ పోలీసు అధికారి ఎలా బుక్ అయ్యారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గొప్పలు చెప్పుకునే తీరే ఆయన కొంప ముంచినట్లు చెబుతున్నారు. తన వెనుక బిగ్ బాస్ ఉన్నారంటూ చాలామంది దగ్గర గొప్పలకు పోయే వారని తెలుస్తోంది. తన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కాపాడేందుకు పోలీస్ బాస్ డీజీపీ ఉన్నట్లుగా ఆయన చెప్పుకునేవారు. ఆయనే తన గాడ్ ఫాదర్ అంటూ చెప్పుకోవటమే కాదు.. ఎక్కడో బీరకాయ పీచు బంధురికాన్ని అందరికి చెబుతూ.. తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే ఆయన వ్యవహారం ఆయన దగ్గరకు వెళ్లటంతో ఆయన నజర్ పడినట్లుగా చెబుతున్నారు. అతగాడు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీపీ.. అవినీతి భాగోతాల్ని తవ్వి తీయాలని చెప్పినట్లుగా సమాచారం.

తన పేరును విపరీతంగా వాడేస్తున్న పోలీసు అధికారి మీద ఫోకస్ పెట్టాలని చెప్పటంతో.. ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా చేసే డీల్స్ మొత్తం బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెండ్ అయిన నాటి నుంచి ఏసీపీ నరసింహారెడ్డి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి  పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గొప్పలకు పోయి.. నోటి దూలతో నెత్తి మీదకు తెచ్చుకున్నారన్న మాట పోలీసు శాఖలో వినిపిస్తోంది.
Tags:    

Similar News