మమతకు మేనల్లుడి షాక్

Update: 2022-02-13 05:30 GMT
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెద్ద తలనొప్పిగా మారాడు. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని, ఎన్డీయే, యూపీయేయేతర పార్టీలకు నాయకత్వం వహించాలని ఆరాటపడుతున్న మమత కు పార్టీలోనే తలనొప్పులు పెరిగిపోతున్నాయి. అదికూడా మేనల్లుడు అభిషేక్ కారణంగానే పెరిగిపోతుండటం విచిత్రంగా ఉంది. ఈ తలనొప్పులు భరించలేకే చివరకు మమత పార్టీ కార్యవర్గాన్నే రద్దు చేయాల్సొచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే పార్టీలోని సీనియర్లకు జూనియర్ నేతలకు మధ్య గొడవలు మొదలయ్యాయి. పార్టీలోని నేతలకు ఇక నుంచి ఒకే పదవి ఉండాలనే నినాదం బాగా ఊపందుకుంది. చాలామంది సీనియర్ నేతలు రెండు  పదవులను అనుభవిస్తున్నారు.

 పార్టీలోను, ప్రభుత్వంలోను పదవులు అనుభవిస్తున్న విషయం జూనియర్లకు మంటగా తయారైంది. అందుకనే వారంతా అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో వన్ లీడర్-వన్ పోస్టు అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.

తాజా నినాదంతో సీనియర్లకు బాగా మండిపోయింది. ఎందుకంటే వీళ్ళంతా పార్టీ పెట్టినప్పటి నుండి మమతతో నడుస్తున్నవారే. జూనియర్లలో చాలామంది ఈ మధ్యనే పార్టీలోకి అడుగుపెట్టిన వారు. పార్టీలో, ప్రభుత్వంలోని పదవులంతా సీనియర్లే అనుభవిస్తుంటే ఇక తమ పరిస్దితి ఏమిటనేది జూనియర్ల వాదన. అయితే ఇక్కడ జూనియర్లు మరచిపోయిన విషయం ఏమిటంటే మమతతో పాటు ఎంతోమంది సీనియర్లు సంవత్సరాల తరబడి కష్టపడితేనే సీపీఎం ప్రభుత్వాన్ని ఓడించి తృణమూల్ అధికారంలోకి వచ్చిందని.

మమతకు ఎక్కడ సమస్య మొదలైందంటే జూనియర్లకు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే నాయకత్వం వహించటం. చాలామంది సీనియర్లతో మేనల్లుడికి పడటంలేదు. అందుకనే సీనియర్ల స్ధానంలో తన మద్దతుదారులను తీసుకురావాలనేది అబిషేక్ ఆలోచన. దాంతో తరచు సీనియర్లకు జూనియర్లకు గొడవలవుతున్నాయి. దీంతో రెండువైపుల నుండి వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోలేక చివరకు రాష్ట్ర కార్యవర్గాన్నే మమత రద్దుచేశారు.

సీనియర్లను విస్మరించేందుకు లేదని మమత వాదనగా ఉంది. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగానే కొందరికి రెండు పదవుల్లో నియమించినట్లు మమత చెప్పారు. అయితే దాన్ని అభిషేక్ అంగీకరించటం లేదు. అందుకనే పార్టీ కార్యవర్గం మొత్తాని మమత రద్దుచేసేశారు. దాని స్ధానంలో 20 మందితో వర్కింగ్ కమిటిని నియమించారు. మళ్ళీ ఇందులో కూడా సీనియర్లు, జూనియర్లుండటమే కొసమెరుపు.
Tags:    

Similar News