విజయవాడలో ఆవులకి వింత రోగం..ఆందోళనలో స్థానికులు!

Update: 2020-04-22 10:12 GMT
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా కరోనా వైరస్ భయాలు స్థానికులని వెంటాడుతున్నాయి. కరోనా భయంతో  ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంటి నుంచి ఎవరూ కూడా బయటకు రావడం లేదు. అయితే , ఇటువంటి సమయంలో కృష్ణాజిల్లాలో 70 ఆవులకు ఎర్ర మచ్చలు రావడం - కళ్లలో నుంచి రక్తం కారుతుండటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కృష్ణాజిల్లా కొండపల్లిలో 70 ఆవులు తాజాగా అస్వస్దతకు గురయ్యాయి. శరీరంపై ఎర్రమచ్చలు రావడంతో పాటు కొన్ని రోజులుగా కళ్లలో నుంచి రక్తం కారుతోంది. దీనితో ఆవులకి కరోనా సోకిందేమో అన్న అనుమానంతో స్ధానికుల్లో  ఆందోళన పెరిగింది. రోజురోజుకి ఎక్కువ సంఖ్యలో ఆవులకు ఇదే సమస్య  తలెత్తడంతో వాటి దగ్గరికి వెళ్లేందుకు జంకుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో స్ధానికుల ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యులు వచ్చి ఆవులను పరీక్షించారు. చివరికి గోవులకు పొంగుజబ్బు వచ్చినట్లు నిర్ధారించారు. అయితే ఇది కూడా వైరస్ సంబంధమైనదే కావడంతో ఒక గోవు నుంచి ఇతర గోవులకు పాకి ఉంటుందని భావిస్తున్నారు. ప్రజల్లో ఒకరి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా సోకుతున్న కరోనా వైరస్ గోవులకు సోకే అవకాశాలు లేవని డాక్టర్లు చెప్పడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. గోవుల్లో పొంగు వైరస్ మాత్రం శరీరం నుంచి కడుపులోకి వెళ్లి ఉంటే ప్రమాదం తప్పదని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. దీంతో స్ధానికంగా ఉన్న పశువుల ఆస్పత్రిలో వారం రోజుల పాటు వీటిని ఉంచి చికిత్స అందించాలని వైద్యులు  తెలిపారు.
Tags:    

Similar News