బెంగాల్ దంగల్: ఎంఐఎం రూటెటు?
రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉంటే.. వీటిలో దాదాపు 121 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ప్రాబల్య ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది.;
ఈ నెల 23, 29 తేదీల్లో రెండు దశలుగా జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ రూటెటు? ఏం చేస్తోంది? అనేది ఆసక్తిగా మారింది. ఇతర రాష్ట్రాలకు.. బెంగాల్‌కు ఉన్న తేడాల్లో కీలకమైంది.. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉంటే.. వీటిలో దాదాపు 121 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ప్రాబల్య ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది.
దీంతో ఆయా స్థానాల్లో గెలుపు ఓటములు నిర్ణయించేది ముస్లింలే. ఈ నేపథ్యంలో ఎంఐఎంకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకప్పుడు.. తృణమూల్ కాంగ్రెస్(గత మూడుసార్లుగా అధికారంలో ఉన్న పార్టీ) పార్టీకి.. ఎంఐ ఎం పరోక్షంగా సహకరిస్తూ వస్తోంది. దీంతో మమతా బెనర్జీ ప్రయాణం సునాయాసంగా సాగిపోయింది. అయితే.. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఎంఐఎం పంథా మారిపోయిందన్న చర్చ ఉంది. బీజేపీకి ఈ పార్టీ లోపాయికారీగా మద్దతు ఇస్తున్నట్టు చర్చ సాగుతోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా అదే అనుమానం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో ముస్లింల జనాభా 55-60 శాతం ఉంది. ఇక్కడ నియోజకవర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో ఎంఐఎం వ్యవహరించే శైలిపైనే గెలుపు ఓటములు ఆధారపడి ఉంటున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు మమతకు అనుకూలంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు.. తర్వాత చీలిపోయింది. ఆ పార్టీకే చెందిన కీలక నేత హుమాయూన్.. బయటకు రావడం.. సొంత పార్టీ పెట్టడంతో ముస్లిం ఓటు చీలింది.
దీనికితోడు ఎంఐఎం వ్యవహారం కూడా బీజేపీకి అనుకూలంగా ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో ముస్లిం లు ఇప్పుడు మమతను వదిలేసి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం వైపు ఉంటారన్న చర్చ ఉంది. ముస్లింల ఓట్లలో 5 నుండి 10 శాతం చీలిక వచ్చినా .. మమత ప్రభుత్వానికి ఇబ్బందేనని అంటున్నారు. అయితే.. ఈ విషయంలో తనను తాను కాపాడుకునేందుకు మమత శత విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాగా.. ఎంఐఎం 122 స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలిపింది. వీటిలో 50 చోట్ల గెలుపు తథ్యమని ఓవైసీ చెబుతున్నారు.