యద్ధం వేళ ఐఎంఎఫ్ చీఫ్ మాటలు విన్నారా?
ముడిచమురు సరఫరాలో చోటు చేసుకున్న ఇబ్బందులు ఇప్పుడు ప్రపంచ ప్రజలకు భారంగా మారుతున్నాయి.;
నాగరిక సమాజంలోనూ యుద్ధాలా? అన్న ప్రశ్నలు కొందరు వేయొచ్చు. కానీ.. అగ్రరాజ్యాల స్కెచ్ కు ప్రపంచ దేశాలు ఎలా నలిగిపోతాయో.. ఎలా పావులుగా మారతాయన్న దానికి నిదర్శనంగా పలు అంశాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచాన్ని కరోనా కోలుకోలేనంత దెబ్బ కొడితే.. దాని నుంచి బయటకు వచ్చిన కొద్ది కాలానికే ఒకటి తర్వాత ఒకటిగా మొదలైన యుద్దాలతోనూ ఇబ్బందులు పడుతున్న దుస్థితి. ఇలాంటి వేళ.. అనూహ్య రీతిలో మొదలైన ఇరాన్ - అమెరికా యుద్ధం ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ముడిచమురు సరఫరాలో చోటు చేసుకున్న ఇబ్బందులు ఇప్పుడు ప్రపంచ ప్రజలకు భారంగా మారుతున్నాయి.
మూడు వారాల్లో ముగిసిపోతుందని అమెరికా భావించిన యుద్ధం.. అందుకు భిన్నంగా సాగుతూనే ఉంది. ఇరాన్ లో జరుగుతున్న యుద్ధం కేవలం ఆ దేశానికి మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాల్పుల విరమణ ప్రకటనతోకాస్త ఊపిరి తీసుకున్నట్లు అనిపించినా.. పాకిస్తాన్ లో జరిగిన శాంతి చర్చలు ఫెయిల్ కావటం.. ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో చేస్తున్న ప్రకటనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ యుద్ధ సెగ సామాన్యుడి జేబుకు గట్టిగా తగులుతున్న పరిస్థితి.
ముడిచమురు..సహజ వాయువు సరఫరా నిలిచిపోతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా దీని అధిపతి క్రిస్టలినా జార్జివా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కఠిన వాస్తవాల్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆమె.. ప్రతి వస్తువుపై ధరల మంట తప్పదని స్పష్టం చేశారు. ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్న అంశాల్లో కీలకమైనవి చూస్తే..
- గడిచిన ఐదు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కావాల్సిన 13 శాతం చమురు, 20 శాతం గ్యాస్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇది చిన్న కుదుపు కాదు. ఒక పెద్ద షాక్.
- ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలు.. ముఖ్యంగా పేద దేశాలు అత్యంత దారుణంగా నష్టపోతున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధరల పెరుగుదల భారాన్ని తమ ఆదాయంపై పడుతున్న అదనపు పన్నులా మోయాల్సి వస్తోంది.
- ఈ యుద్ధం కారణంగా కేవలం ఇంధనానికే కాదు.. రవాణా.. ఎరువులు.. వ్యవసాయ రంగం మీదా తీవ్రప్రభావాన్ని చూపుతుంది. ఎరువుల ధరలు పెరగటంతో భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగే పరమాదం ఉంది.
- ఆసియాలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన కొరతతో సతమతమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్ లో వెంటనే కాల్పుల విరమణ జరిగినా.. తక్షణ ఉపశమనం మాత్రం ఉండదు.
- ధ్వంసమైన గ్యాస్.. ఇంధన.. మౌలిక సదుపాయాలు పూర్తిగా కోలుకునేందుకు మరో మూడు నుంచి ఐదు సవంత్సరాల సమయం పట్టొచ్చు.