రహస్య అజెండాతోనే ఢిల్లీకి.. లోకేశ్ టూర్ పై హాట్ డిబేట్
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.;
టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ టూర్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతి చట్టానికి ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపేందుకే లోకేశ్ ఢిల్లీ వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఒక్క పనిపైనే ఆయన హస్తిన టూర్ పెట్టుకుని ఇంకేదో పెద్ద పని మాత్రం ఉండే ఉంటుందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వం తరఫున అన్ని పనులను మంత్రి లోకేశ్ చక్కబెడుతున్నారు. రాజకీయ సంబంధ నిర్ణయాల అమలు చేయాలన్నా, అభివృద్ధి పరమైన అంశాలైన కేంద్రంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు బదులుగా కుమారుడు లోకేశ్ ను పంపిస్తున్నారని అంటున్నారు. దీంతో లోకేశ్ తాజా పర్యటనపై ఉత్కంఠ కనిపిస్తోంది.
రాష్ట్రపతిని కలిసేందుకు అంటూ ఢిల్లీకి వచ్చిన లోకేశ్ తిరుగు ప్రయాణంలో ఏ ప్రకటన చేస్తారనేది సస్పెన్స్ గా ఉందని అంటున్నారు. లోకేశ్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చిన కేంద్రం నుంచి ఏదో విధంగా సాయం రాబట్టడంలో సక్సెస్ అవుతున్నారని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడంలో కూడా జోరు చూపిస్తున్నారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా లోకేశ్ తో చర్చలకు ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. సహజంగా కేంద్రం ప్రభుత్వంతో ఏదైన రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, లేదంటే సంబంధిత మంత్రులే సమావేశం అవుతుంటారు.
కానీ, మంత్రి లోకేశ్ విషయంలో ఢిల్లీలో పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు. తన శాఖకు సంబంధం లేకపోయినా సరే, ఆయన ప్రతి కేంద్ర మంత్రిని కలవగలుగుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం లోకేశ్ కు తరచూ అపాయింట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆయన ప్రాధాన్యం పెంచుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాల వల్లే లోకేశ్ ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ఆయనను అందరూ ఫాలో అవుతుంటారని చెబుతున్నారు.
ఇక తాజాగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన లోకేశ్ ఏదో ఒక సీక్రెట్ అజెండాను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సందేహిస్తున్నారు. ప్రధానంగా త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలతోపాటు విపక్షంపై పైచేయి సాధించే దిశగా ఆయన ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఇందుకోసం కేంద్ర పెద్దల మద్దతు కోసం ఆయన ఢిల్లీకి వచ్చి ఉంటారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వైఖరి పట్ల కేంద్రం కూడా సంతృప్తిగా లేదన్న ప్రచారం నడుమ లోకేశ్ ఆ దిశగా విపక్షాన్ని టార్గెట్ చేసేలా ఏమైనా వ్యూహం రచించారా? అన్నదానిపై హాట్ డిబేట్ జరుగుతోందని చెబుతున్నారు. దీంతో లోకేశ్ టూర్ ముగిసే లోగా ఈ ఉత్కంఠకు ఏదో ఒక ముగింపు ఉంటుందని ఆశిస్తున్నారు.