పాదయాత్ర కాదు.. పరిగెత్తే యాత్ర చెయ్: కేటీఆర్‌కు కౌంటర్
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన దరిమిలా ఆయనపై ట్రోల్స్ పెరుగుతున్నాయి.;
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. వచ్చే ఏడాది రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని ప్రకటించిన దరిమిలా ఆయనపై ట్రోల్స్ పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి భారీ కౌంటర్ ఇచ్చారు. `పాదయాత్ర కాదు.. పరిగెత్తే యాత్ర చెయ్` అని ఆమె వ్యాఖ్యానించారు. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుందన్నారు. `కొలెస్ట్రాల్` కూడా తగ్గుతుందని అన్నారు.
పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో రాష్ట్ర తీవ్రంగా ధ్వంసమైందని రేణుక వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అడ్డుగోలుగా దోచుకున్న కుటుంబం ఏదైనా ఉంటే అది కేసీఆర్ ఫ్యామిలీనేనని వ్యాఖ్యానించారు. ''పాదయాత్ర చేస్తాడంట.. పాదయాత్ర.. చెయ్.. ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్‌తో పాటు ఇంకా ఏమైనా అహంకారం మిగిలి ఉంటే అది కూడా తగ్గుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది.'' అని తనదైన శైలిలో రేణుక అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించిందన్న రేణుకా చౌదరి ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పాదయాత్ర చేసినా.. పరుగు యాత్ర చేసినా.. ఎవరికీ ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పోలవరం ముంపు గ్రామాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. 2014లో బలవంతంగా ఏపీ ఈ ముంపు గ్రామాలను విలీనం చేసుకుందన్నారు. ఇప్పుడు వాటిని తిరిగి రాష్ట్రంలోకి తీసుకురావాలని దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాలకు తాను సంపూర్ణంగా సహకరిస్తాననిచెప్పారు.
ఆ వ్యాఖ్యలు జగన్ అన్నవే!
ఏపీ రాజధాని అమరావతిపై ఇటీవల రాజ్యసభలో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలను వైసీపీ వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. ''పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమరావతి ... పెట్టరా పెట్టు.'' అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి వైసీపీ నాయకులు అమరావతి కేవలం కమ్మవారికి మాత్రమే సొంత మంటూ ప్రచారం చేస్తోంది. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవి గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలేనని.. తాను కేవలం గుర్తుచేశానంతేనని చెప్పారు. అమరావతి రాజధాని ఎవరు ఔనన్నా..కాదన్నా.. 5 కోట్ల మంది ఆంధ్రుల సొంత మని చెప్పారు.