ఇక.. గ్రేటర్ విజయవాడ.. టీడీపీకి లాభమెంత.. ?
విజయవాడ మహానగరాన్ని మరింత విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;
విజయవాడ మహానగరాన్ని మరింత విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న విజయవాడ ను గ్రేటర్ విజయవాడ గా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న 70- 80 గ్రామాల వరకు విజయవాడలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. తద్వారా విజయవాడ నగర పరిధి భారీ స్థాయిలో పెరగనుంది. దీనిలోకి గన్నవరంలోని పలు ప్రాంతాలు అదేవిధంగా పనమలూరులో నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు కూడా కలవనున్నాయి.
తద్వారా గ్రేటర్ విజయవాడను విస్తరించి రాజధానికి అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. ఇప్పటికే కృష్ణ నదిపై ప్రకాశం బ్యారేజీకి సమాంతరంగా మరో బ్యారేజీని నిర్మించనున్నారు. దీనికి కూడా టెండర్లు పిలిచారు. తద్వారా విజయవాడ నగరానికి అమరావతికి మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. అయితే, గ్రేటర్ విజయవాడ ఏర్పడటం వల్ల రాజకీయంగా టిడిపికి ఎలాంటి ప్రయోజనం జరుగుతుందని ప్రధాన చర్చ. గతంలో జిల్లా విభజన ద్వారా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా తమ మేలు జరుగుతుందని వైసీపీ అంచనా వేసుకుంది.
కానీ గత ఎన్నికల్లో అది విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవాడ ను గ్రేటర్ విజయవాడ గా మార్చడం వల్ల టిడిపికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల మధ్య చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అంశాలను తీసుకుంటే ఇటు హైదరాబాద్ దిశగా గొల్లపూడి వైపు, గన్నవరం వైపు వచ్చేసరికి నున్న, అదే విధంగా విజయవాడ బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత కానూరు వరకు మాత్రమే ఈ పరిధి విస్తరించి ఉంది.
దీనిని ఇప్పుడు అటు కంకిపాడు వరకు.. ఇటువైపు దాదాపు గన్నవరం దాకా అలాగే గుంటుపల్లి ఇబ్రహీంపట్నం వరకు కూడా విజయవాడ నగర పరిధిని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లో జరుగుతున్న మార్పులు కావడంతో తమకు మేలు జరుగుతుందని ఆయా పార్టీ వర్గాల మాట. గ్రామాలను విజయవాడలో కలపాలని కొన్ని గ్రామాల ప్రజలు కోరుతుంటే మరికొన్ని గ్రామాలు మాత్రం వద్దని జిల్లా పరిధిలోనే ఉంటామని చెబుతున్నాయి. ఇట్లా భిన్నమైనటువంటి అంశాలు తెరమీదకు వచ్చాయి.
అయినప్పటికీ గ్రేటర్ విజయవాడ ను విస్తరించాలనే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. దీనివల్ల నగర పరిధి పెరిగి రాజధానికి అనుసంధానం ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా రాజధాని పరిధిలోనే విజయవాడ నగరం కూడా కొనసాగుతుందని భావిస్తోంది. ఇది పార్టీ పరంగా తమకు మేలు చేస్తుందని నాయకులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది నాటికి పూర్తిచేయాలని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
గన్నవరం, నూజివీడు, పెనమలూరు, మైలవరం వంటి కీలక నియోజకవర్గాలకు సంబంధించిన 70 నుంచి 80 గ్రామాలు విజయవాడలో విలీనం కానున్నాయి. తద్వారా విజయవాడ నగరపాలక సంస్థకు ఆదాయం పెరగడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని రహదారులు విద్యుత్ సౌకర్యం ఇంటింటికి నీరు పారిశుధ్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాదు రాజధానికి అనుసంధాన నగరంగా కూడా విజయవాడ ఉంటుందని అంచనా వేస్తోంది.