అమ‌రావ‌తిలో హోట‌ళ్ల‌కు భారీ భూకేటాయింపులు!

Update: 2017-07-27 04:19 GMT
భూముల కేటాయింపు విష‌యంలో త‌న‌దైన నిర్ణ‌యాన్ని తీసుకున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి పెద్ద ఎత్తున హోట‌ళ్లు వ‌స్తాయ‌ని.. ఇందులో భాగంగా ఆ హోట‌ళ్ల‌కు అవ‌స‌ర‌మైన భూమిని సిద్ధంగా ఉంచాల‌ని  అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

అమ‌రావ‌తిలో స్టార్ హోట‌ళ్ల నిర్మాణానికి 500 ఎక‌రాలు సిద్ధంగా ఉంచాల‌ని ఆయ‌న కోరారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే హోట‌ళ్ల కోసం భూమిని అందుబాటులో ఉంచాల‌ని చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. బుధ‌వారం వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యం కార్యాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించిన చంద్ర‌బాబు.. స్టార్ హోట‌ళ్ల‌కు కేటాయించే భూమి మీద స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

సీఎం అలా సూచ‌న చేశారో లేదో.. ఆ వెంట‌నే ఆయ‌న మాట‌కు బ‌దులుగా సీఆర్డీఏ అధికారులు ప‌లు స్టార్ హోట‌ళ్ల కంపెనీలు అమ‌రావ‌తిలో హోట‌ళ్ల‌ను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. రాడిస‌న్‌.. జీఆర్ టీ.. తాజ్‌.. పార్క్‌.. నోవాటెల్ లాంటి ఎనిమిది స్టార్ హోట‌ళ్ల యాజ‌మాన్యాలు అమ‌రావ‌తిలో త‌న హోట‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌టానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా పేర్కొన‌టం విశేషం.
 
మొత్తానికి అమ‌రావ‌తి ప్రాంతంలో పెద్ద ఎత్తున హోట‌ళ్ల‌ను తీసుకొచ్చేందుకు భూములు సిద్ధం చేయ‌మ‌న్న బాబు.. మ‌రి ఆ స్టార్ హోట‌ళ్ల‌కు భూములు ఇచ్చే విష‌యంలో ఏ త‌ర‌హా ఒప్పందం చేసుకుంటార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. బాబు నోటి నుంచి హోట‌ళ్ల నిర్మాణం కోసం భూముల్ని సిద్ధంగా ఉంచాల‌న్న మాట వ‌చ్చి రాగానే.. అమ‌రావ‌తిలో హోట‌ళ్ల‌ను ఏర్పాటు చేయాల‌న్న ఆస‌క్తిలో ఉన్నాయంటూ స‌ద‌రు స్టార్ హోట‌ళ్ల జాబితాను అధికారులు చెప్ప‌టం చూస్తే ప‌లు సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. స‌హ‌జంగా  పెద్ద పెద్ద స్టార్ హోట‌ళ్ల నిర్మాణం కోసం సీఎంను క‌లుస్తారు కానీ.. అధికారుల్ని క‌లిసి త‌మ ఆలోచ‌న‌ల్ని స్టార్ హోట‌ళ్ల యాజ‌మాన్యాలు చెప్ప‌వు క‌దా? కానీ.. తాజా ఉదంతంలో అందుకు రివ‌ర్స్ లో జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News