కార్పొరేట్ ఎఫెక్ట్: 60 రోజుల్లో 50 మంది మృతి
కొర్పొరేట్ కళాశాలల్లో డబ్బు పోయినా పిల్లలకు అద్బుతమైన చదువు వస్తుంది! అనే కామెంట్లు ఇప్పుడు కరువయ్యాయి. డబ్బు పోయి.. పిల్లలు కూడా దక్కని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ర్యాంకుల పంటలో పిల్లలు కలుపుమొక్కలుగా మారిపోయారు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. చదువుల ఒత్తడి తట్టుకోలేక... కేవలం రెండునెలల్లో 50 మంది విద్యార్థులు ప్రాణం తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో గడిచిన వారం రోజులుగా కార్పొరేట్ కాలేజీలపై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
తరగతి గదిలో ఏం జరుగుతోంది? విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి బాధ్యులు ఎవరు? అన్న ప్రశ్నలు చాలామంది పేరెంట్స్‌ని వెంటాడుతున్నాయి. మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు సంపాదించాలన్న ఆశతో పేరెంట్స్ తమ పిల్లలను లక్షలకు లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఐతే, అక్కడ ఒత్తిళ్లు తట్టుకోలేక, అమ్మానాన్నల కలల్ని నిజం చేయలేమేమోనన్న బెంగతో విద్యార్థులు విగతజీవులుగా మారిపోతున్నారు. కాలేజీ యాజమాన్యాల విచ్చలవిడి కోచింగ్ లు - క్రమశిక్షణ పేరుతో పెడ్తున్న ఒత్తిళ్లే ఈ బలవన్మరణాలకు కారణమని బాలల హక్కుల సంఘాలు గొంతెత్తి అరుస్తున్నాయి.
ఇంటర్మీడియట్ లో 95 శాతం మార్కులు సాధించి నీట్ ద్వారా మెడికల్ సీటు సాధిద్దామనుకున్న సంయుక్త అనే అమ్మాయి.. హైదరాబాద్ లో ఓ కోచింగ్ సెంటర్ చేరింది. కానీ మూడునెలలు తిరిగేసరికల్లా ఆత్మహత్య చేసుకుంది. ఒత్తిడి భరించలేకనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు ఆమె పేరెంట్స్. ఇదే విషయాన్ని సూసైడ్ నోటులో రాసిందని ప్రస్తావించారు. ఇక విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్ధులందరి ముందు టీచరే ఒక స్టూడెంట్ ని దారుణంగా అవమానించడంతో అది భరించలేక ఆ స్టూడెంట్ కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో! నిజానికి కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులను క్లాస్ లో 8 గంటలకు మించి కూర్చోబెట్టకూడదు. అలాగే వాళ్లని తీవ్రంగా దూషించడం - కొట్టడం లాంటివి చేయకూడదు. బాలల హక్కుల సంఘం నేతలు ఈ విషయాన్ని నెత్తీనోరూ బాదుకుని చెప్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. కోచింగ్ సెంటర్లు తమ ఇష్టమొచ్చినట్టు విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయని, వీటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. మరి తాజా ఉదంతాలపై చంద్రబాబు ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉంది. అయినా కూడా చర్యలు తీసుకుంటారన్న గ్యారెంటీ ఏమీ లేకపోవడం గమనార్హం.