ఆన్‌ లైన్ ఆధ్యాత్మికంతో కోట్ల రూపాయ‌ల బిజినెస్‌...!

Update: 2019-07-02 06:54 GMT
``మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు కుద‌ర‌డం లేదు. ప‌రిష్కారం సూచిస్తారా?``- ``మా అబ్బాయి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహ ప్ర‌య‌త్నాలు ప్రారంభించాల‌ని అనుకుంటున్నాం.. ఏం చేయ‌మంటారు?``- ``తిరుమ‌ల శ్రీవారి ఆల‌యానికి తొలిసారి వెళ్తున్నాను. అక్క‌డ త‌ల‌నీలాలు ఏస‌మ‌యంలో స‌మ‌ర్పిస్తే..పుణ్యం వ‌స్తుంది?``- ``మాది ఉమ్మ‌డి కుటుంబం. ఒకే ఇంట్లో రెండు పొయ్యిల‌పై వంట చేసుకోవ‌చ్చా!?``- ఇలాంటి అనేక స‌మ‌స్య‌లు - సందేహాలు నిత్యం కొన్ని వంద‌లాది మందిని వేధిస్తుంటాయి. మ‌రి ఇలాంటి వారికి ఎవ‌రు ఆ సందేహాల‌ను నివృత్తి చేస్తారు? ఎవ‌రు వారికి స‌రైన దిశ నేర్పుతారు?  నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంటే.. ఏదోలా ఇంట్లో పెద్ద‌వాళ్లు ఉండేవారు.. వారు చెప్పేవారు.

కానీ, నేడు మారిన క‌ల్చ‌ర్ ప్ర‌పంచంలో వృద్ధాశ్ర‌మాల్లోనే పెద్ద‌లు ప‌రిమిత‌మ‌వుతున్నారు. సో.. ఇప్పుడున్న యువ‌త‌కు కానీ - మ‌ధ్య వ‌య‌స్కుల‌కు కానీ ఒక మంచి - చెడుల గురించి సూచించేవారు - ఆధ్యాత్మిక స‌ల‌హాల‌ను పంచేవారు క‌నిపిం చ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల‌కు-ఆధ్యాత్మికానికి అనుసంధానంగా తెర‌మీదికి వ‌చ్చింది.. ఆన్‌లైన్‌. ఇటీవ‌ల కాలంలో ప్ర‌పంచం మొత్తం చేతిలోనే ఉంటోంది. ముఖ్యంగా ఫైబ‌ర్ నెట్ వ‌చ్చాక‌.. దేశం మొత్తం కూడా ఇంట‌ర్ నెట్ సేవ‌లు మ‌రింత‌గా అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఆన్‌ లైన్ కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక సంస్థ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి.

ఏ సందేహాన్న‌యినా. స‌మ‌స్య‌నైనా.. పురాణాలు - ఇతిహాసాలు - రామాయ‌ణ‌ - భాగ‌వ‌తాది గ్రంధాల్లోని విశేషాల‌ను కూడా ఈ సైట్లు విస్తృతంగా అందిస్తున్నాయి. పూజ ఎలా చేయాలి?  భోజ‌నం ఎలా చేయ‌కూడ‌దు.. వంటి విష‌యాల నుంచి వివాహాది క్ర‌తువుల వ‌ర‌కు నెట్టింట్లో మ‌న‌కు ఒక్క క్లిక్‌ తో అందించే సంస్థ‌లు ఉన్నాయి. వీటిలో ప్ర‌ధానంగా ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ ఛానెల్ నుంచి మైమందిర్‌ - ఆర్‌ జ్ఞాన్‌ - కాల్ప‌నిక్ టెక్నాల‌జీస్‌.. వంటి దాదాపు రెండు వంద‌ల వ‌ర‌కు సంస్థ‌లు ఆన్‌లైన్ ఆధ్యాత్మిక బిజినెస్‌ ను ప‌రుగులు పెట్టిస్తున్నాయి. అయితే, ఈ ఆధ్యాత్మికం వెనుక అస‌లు సిస‌లు బిజినెస్ దాగి ఉంద‌నే విష‌యాన్ని గుర్తించాలి.

హిందూ ధ‌ర్మ శాస్త్రం ఒక నిగూఢ ర‌హ‌స్యాల‌తో నిండిన డిక్ష‌న‌రీ- అంటారు స‌ర్వేప‌ల్లి రాధా కృష్ణ‌. ఎన్ని సందేహాలు ఉం టాయో.. అన్ని జ‌వాబులు కూడా ఉంటాయి. చంద్ర‌గ్ర‌హణంపై అనేక సందేహాలు.. వీటికి స‌మాధానాలు ఉన్నా.. ఇప్ప‌టి కే ఏదొ ఒక్క స‌రికొత్త సందేహం ప్ర‌తి సారీ తెర‌మీదికి వ‌స్తూనే ఉంటుంది. ఇలాంటి ఆస‌క్తి ఉండ‌బ‌ట్టే.. ఆయా ఆన్‌ లైన్ చానెళ్ల‌కు వీక్ష‌కుల సంఖ్య కూడా అప‌రిమితం. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం దేశంలో అతిపెద్ద వ్యాపార రంగంగా ఆన్‌ లైన్ ఆధ్యాత్మికం మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం 30 బిలియ‌న్ డాల‌ర్ల మేర‌కు ఈ బిజినెస్ సాగుతోంద‌ని చెబుతున్నారు. మొత్తానికి భ‌గ‌వంతుడికి-భ‌క్తుడికి మ‌ధ్య అనుసంధానంగా ఉంటూనే అప‌రిమిత ఆర్జ‌న చేస్తున్న రంగంగా ఇది గుర్తింపు సాధించింది.
Tags:    

Similar News