తెలంగాణా దేవుడు..ఆంధ్రా దేవుడూ...పవన్ కామెంట్స్ వైరల్
ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమి మాట్లడినా క్షణాలలో వైరల్ అవుతుంది. ఆయన రాజకీయంగా కీలక స్థానంలో ఉండడమే కాదు, ప్రముఖ సినీ నటుడు కూడా;
ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమి మాట్లడినా క్షణాలలో వైరల్ అవుతుంది. ఆయన రాజకీయంగా కీలక స్థానంలో ఉండడమే కాదు, ప్రముఖ సినీ నటుడు కూడా. అందువల్ల ఆయన మాట్లాడే ప్రతీ మాటా రీ సౌండ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా చూస్తే పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జనసేన నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పదవీ బాధ్యత అన్న దాని గురించి గుర్తు చేస్తూ ఆయన వారికి దిశా నిర్దేశం చేశారు. దాంతో ఆయన ఎవరేమిటి పనిచేయాలి, పదవీ బాధ్యతలు ఎలా ఉంటాయి. నాయకులుగా జనంలో ఎలా మెలగాలి అన్నది చెబుతూనే సున్నితమైన కొన్ని అంశాల విషయంలో ఏ విధంగా రియాక్ట్ కావాలన్నది కూడా చెప్పుకొచ్చారు.
దేవుడూ హిందూమతం :
ఇక పవన్ జనసేన సమావేశంలో దేవుడి ప్రస్తావన వచ్చింది. అంతే కాదు హిందూ మతం ప్రసక్తి కూడా వచ్చింది. సాధారణంగా ఇలాంటి మాటలు బీజేపీ సమావేశాలలోనే వస్తాయి. అయితే పవన్ ఇటీవల కాలంలో సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా వచ్చిందనుకున్నా దాంతో పాటుగా మరో కీలకమైన విషయం కూడా ఇందులో ఉంది. అదే ప్రాంతీయవాదం. పవన్ దాని గురించి ఎలా చెప్పారు అంటే తెలంగాణా దేవుడు ఆంధ్రా దేవుడు అని అంటారు, కానీ దేవుడు ఎక్కడైనా దేవుడే అని స్పష్టం చేశారు. దేవుడు వేరు కాదు అని ఇవన్నీ అర్ధ రహితమైన వాదనలు అన్నారు.
అవన్నీ నమ్మకాలు :
మానసిక స్థాయి తగ్గినపుడే అర్థరహితమైన వాదనలు వస్తాయని ఆయన అన్నారు. అలాంటి డిబేట్లలో జనసేన నేతలు ఎవరూ పాల్గొనరాదని పవన్ కోరారు. భగవంతుడు హైందవ ధర్మం అందరిదీ అన్నారు. అలాగే తిరుపతి బాలాజీ హుండీలో డబ్బులు అంబానీ లాంటి వారు వేస్తారు అదే సమయంలో పేదవారూ వేస్తారు అని చెప్పారు. ఇక ఆ డబ్బులు ఎవరి చేత ఎలా ఖర్చు పెట్టించాలన్నది ఆ స్వామి ఇష్టమని ఆయన ఎవరి నోటనో పలికించి చేయించుకుంటారని పవన్ చెప్పారు. ప్రాంతీయ వివాదాలలో మీరు వెళ్లవద్దు అని ఆయన అన్నారు. తెలంగాణా వెంకటేశ్వర స్వామి ఆంధ్రా వెంకటేశ్వరస్వామి తమిళనాడు సుబ్రమణ్య స్వామి ఏపీలో మోపిదేవి సుబ్రమణ్య స్వామి అని అంటుంటారు అని పవన్ సెటైర్లు వేశారు.
జనసేన అందరిదీ :
మొత్తానికి పవన్ చెప్పిన దాంట్లో అర్ధం సారాంశం ఏమిటి అంటే సంకుచితమైన ప్రాంతీయ ఇతర భావ జాలాలను పట్టుకుని జనసేన క్యాడర్ వ్యర్ధ వాదనలు చేయవద్దని. జనసేన అయితే తెలంగాణాలో కూడా ఉంది. ఏపీలో ఉంది. అలాగే అందరి పార్టీగా ఉండాలన్నది పవన్ ఆలోచన అని చెబుతున్నారు. ఇక ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టే రాజకీయం కూడా సాగుతున్న వేళ పవన్ క్యాడర్ కి చేసిన ఈ తరహా దిశా నిర్దేశం అయితే ఆలోచింపచేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా పవన్ మంచి సందేశం ఇచ్చారు అని పార్టీలకు అతీతంగా అంతా అంటున్నారు.