పవన్ బిగ్ సౌండ్ వెనక ?
కట్ చేస్తే మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ మాట్లాడుతూ వైసీపీకి శాశ్వతంగా అధికారం దక్కకుండా చేస్తామని కూడా మరోసారి ప్రకటించారు.;
పవన్ కళ్యాణ్ మళ్ళీ బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఆయన తాజాగా గోదావరి జిల్లాలో మాట్లాడుతూ వైసీపీ మీద ఒక రేంజిలో విరుచుకుపడ్డారు. ఆయన నిడదవోలు నియోజకవర్గంలో జరిగిన సభలో అయితే వైసీపీ నేతల మీద అన్న మాటలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. చేతి గీతలు లేకుండా చేస్తామని ఆయన హూంకరించారు. తోలు తీస్తాం, తాట తీస్తామని ఆగ్రహించారు. అంతే కాదు ఏమి పీకారు అని కూడా మాట్లాడారు. ఆ వేదిక మీద ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారులు ఇతరులు ఉన్నారు. పవన్ మాత్రం తన ఆవేశాన్ని గట్టిగానే చూపించారు.
శాశ్వతంగా వైసీపీకి :
కట్ చేస్తే మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ మాట్లాడుతూ వైసీపీకి శాశ్వతంగా అధికారం దక్కకుండా చేస్తామని కూడా మరోసారి ప్రకటించారు. ఆ పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించను అన్నారు. తప్పులు చేసిన వారిని శిక్షిస్తామని చూస్తూ ఊరుకోమని కూడా ఆయన అంటున్నారు. అయితే ఈ మాటలు జనంలోకి వేరేలా వెళ్తున్నాయని అంటున్నారు. పవన్ ఇపుడు విపక్షంలో అయితే లేరు, ఆయన తలచుకుంటే వైసీపీ నేతలు ఎవరు తప్పు చేసినా వారిని అరెస్ట్ చేసే అధికారాన్ని జనాలు ఇచ్చారు. అది జగన్ నుంచి ఎంతటి పెద్ద నాయకుడు అయినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా అంటున్నారు. అలాంటి రాచబాట వదిలేసి కేవలం మాటలు వార్నింగులు ఎందుకు అన్న చర్చ అయితే వస్తోంది.
పొజిషన్ లో ఉంటూ :
ఇక అపొజిషన్ అని చాలా మంది బాధపడతారు కానీ అక్కడ నుంచి ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అయినా చేయవచ్చు. ఇపుడు ఆ ప్లేస్ లో వైసీపీ ఉంది. వారు ప్రశ్నిస్తారు, కొండ మీద కోతిని దించమంటారు, ప్రభుత్వం తప్పులు చేసినా చేయకపోయినా నిందిస్తారు, ప్రభుత్వం అయితే కాచుకోవాల్సి ఉంటుంది. తప్పులు చేయకపోతే మాత్రం సమర్ధించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఆవేశం చూపిస్తే ప్రజలలో కూడా అదే చర్చకు వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా మరో ప్రతిపక్షం అన్నది పాలకులు ఎపుడూ గుర్తించాల్సి ఉంది. ఇపుడు పవన్ పొజిషన్ లో ఉన్నారు. అంటే ప్రశ్నించే స్థానం కానీ ఆవేశపడే స్థానం కానీ ఆయనది కాదని అంటున్నారు. ప్రజా సమస్యల మీద పరిష్కారాలు వెతకాల్సిన బాధ్యతను ప్రజలు ఇచ్చారు. అదే సమయంలో విపక్షాలు ఏమి మాట్లాడినా ప్రభుత్వం వైపే ప్రజల చూపు ఉంటుందన్నది గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.
వ్యూహాత్మకంగానే :
అయితే పవన్ ఆవేశం వెనక వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. క్యాడర్ మీద ఇంత కాలం ఆయన ఫోకస్ పెద్దగా పెట్టలేదని వారిని స్థానిక ఎన్నికల సమరం దిశగా కదిలించాల్సి ఉందని అందుకే ఆయన వైసీపీ మీద గట్టిగా విరుచుకుపడుతున్నారు అని అంటున్నారు. అయితే క్యాడర్ కి ఇచ్చే సందేశం అయితే పార్టీ సభలలో మాట్లాడితే బాగుంటుంది కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో లాగుడూ పీకుడూ భాష మాత్రం హుందాగా ఉండదని అంటున్నారు. ఇక వైసీపీని అధికారంలోకి రానీయను ఇది నా శాసనం అని 2019లో పవన్ చెప్పినా వైసీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. అందువల్ల రాజకీయంగా సవాళ్ళూ శపధాలు కాకుండా ప్రజల కోసం గట్టి మేలుని తలపెట్టే విధంగా వ్యవహరించాలన్నదే పవన్ నుంచి అంతా కోరుతున్నారు.