2019 రిజల్ట్ పై ఆ మేధావుల్లో పిచ్చ క్లారిటీ!

Update: 2018-01-15 08:21 GMT
రచయితలు, కవులు అంటే మన సమాజంలో ఒక కేటగిరీ మేధావుల కింద లెక్క. అలాంటి గుర్తింపు వారికి పుష్కలంగా ఉంది. అందులోనూ విప్లవ రచయితల సంఘం (విరసం) రచయితలు అంటే పుష్కలమైన వామపక్ష భావజాలం కూడా వారి సొంతం. వారందరూ కలిసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే దాని అంతరార్థంలో ఏదో ఉంటుదని మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. అలాంటిది.. ఇప్పుడు తాజాగా విరసం కవులు, రచయితలు వారికి సంబంధించిన మేధావులంతా సమావేశంపెట్టి.. 2019 ఎన్నికలను పూర్తిగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నారు. చూడబోతే.. 2019 ఎన్నికల్లో రాబోయే ఫలితాల మీద ఈ మేధావులకు పూర్తి స్పష్టత ఉన్నదని.. అందుకే ఆ ఫలితం తమ భావజాలానికి విరుద్ధంగా ఉంటుంది గనుకనే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారని అనిపిస్తోది.

విరసం మేధావులు వామపక్ష అనుకూల భావజాలంతో ఉంటారనడంలో సందేహం లేదు. ఒకవైపు మోడీ సర్కారును గద్దె దించడానికి దేశంలో.. మోడీ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకురావడంలో.. వామపక్ష పార్టీలు కూడా తమ వంతు కష్టం పడుతున్నాయి. ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కాకపోతే సదరు కూటమికి బలం చాలడం లేదు. ఇలాంటి నేపథ్యంలో.. అసలు 2019 ఎన్నికల్లో ప్రజలు పాల్గొనడమే వద్దు బహిష్కరించాలి.. అని విరసం పిలుపు ఇవ్వడంలో అంతరార్థం.. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అనే భయం వారిలో ఉన్నదేమోనని పలువురు విశ్లేషిస్తున్నారు.
Read more!

అక్కడక్కడా ఎదురుదెబ్బలు తప్పకపోతున్నా.. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం స్థిరమైన పురోగతినే కనబరుస్తోంది. కాంగ్రెస్ చేతిలోని కొన్ని రాష్ట్రాలను కూడా తమ సొంతం చేసుకుంటోంది. పరిపాలన పరంగా.. కొన్ని ప్రజాకంటక నిర్ణయాలతో సామాన్యులను రాచి రంపాన పెట్టినప్పటికీ.. అవినీతి మరకలు అతి తక్కువగా ఉన్న ప్రభుత్వంగా కేంద్రంలో చెలామణీ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయని బహుశా విరసం భావిస్తుండవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే అసలు ఎన్నికలనే బహిష్కరించాలనే పిలుపు ఇస్తున్నారని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయినా మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్టుగా.. విరసం పిలుపులకు ప్రజలు ఎన్నికలను బహిష్కరించడం కూడా ఈ దేశంలో కలలో మాట అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయతే.. నల్లమల అడవులు ప్రస్తుతం ఖాళీ అయ్యాయని, రానున్న రోజుల్లో మళ్లీ నిండుకుని నక్సల్ ఉద్యమం వస్తుందని విరసం పెద్దలు ఆశలు వ్యక్తం చేస్తున్నారు. బిట్వీన్ ది లైన్స్ చూస్తే.. నక్సల్ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసినట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్న మాటలు నిజమే అనిపిస్తోంది.
Tags:    

Similar News