కేటీఆర్ లంచ్‌...12 మంది ఎమ్మెల్యేలు పార్టీ జంప్‌

Update: 2019-06-06 11:59 GMT
తెలంగాణ‌లో రాజకీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఒక‌దాని వెంట మ‌రొక‌టి అన్న‌ట్లుగా ఒకేరోజు జ‌రిగిన ప‌రిణామాలు...రాష్ట్రంలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి ఊపు ఇవ్వ‌గా...ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ పార్టీని నిరాశ‌ప‌ర్చాయి. ఓ ఎమ్మెల్యే ఊహించ‌ని రీతిలో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌ బై చెప్పేయ‌గా....దీనికి కొన‌సాగింపుగా...కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారుతున్నామ‌ని పేర్కొంటూ స్పీక‌ర్‌ కు లేఖ ఇవ్వ‌డ‌మే కాకుండా....కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని సీఎల్పీలో విలీనం చేయాల‌ని కోరారు.

అనూహ్య రీతిలో తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇవాళ టీఆర్ ఎస్‌ లో చేరారు. ఉదయం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఆయన ప్రగతి భవన్‌ లో కలిసి తాండూర్ నియోజకవర్గ  అభివృద్ధి గురించి చర్చించి..అనంత‌రం టీఆర్ ఎస్‌ లో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అంతకుముందే.. ఆయన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు. ఎంపీగా గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధ‌వారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో సీఎల్పీ విలీనానికి 12 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే అవ‌స‌రం అయింది. ఇప్ప‌టికే పార్టీ మారాలని ఇప్పటికే నిర్ణయించుకున్న 11 ఎమ్మెల్యేలకు రోహిత్‌ రెడ్డి తోడ‌వ‌డంతో సీఎల్పీ విలీనానికి సిద్ధ‌మ‌య్యారు.

తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొత్తం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీస్‌ కు చేరుకోగా వారితో కేటీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటుచేశారు. విలీన ప్రతిపాదన పత్రంపై 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.  ఈ డాక్యుమెంట్ తో ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా మినిస్టర్స్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి విలీన ప్రతిపాదన పత్రాన్ని అందజేశారు. స్పీకర్ ఆమోదం తర్వాత.. విలీన ప్రకియ పూర్తి కానుంది. కాగా, ఈ ప్ర‌క్రియ ద్వారా ప్ర‌జాస్వామ్యాన్ని చంపేశార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
 
    
    
    

Tags:    

Similar News