అమెరికా విద్యార్థి వీసా సస్పెన్షన్ : ఆందోళనలో తెలుగు విద్యార్థులు
ప్రస్తుత నిర్ణయం కారణంగా అనేక మంది విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లు లభించడం లేదు.;
అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం, ఫాల్ 2025 ఇన్‌టేక్ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో ఫాల్ సీజన్‌లోనే 60% నుండి 70% మంది ఉంటారు. 2023లో అమెరికాలో ఉన్న 2.7 లక్షల విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం కాగా, వారిలో 13% మంది తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్లారు.
-వీసా ఇంటర్వ్యూలలో జాప్యం: విద్యార్థులకు అనిశ్చితి
ప్రస్తుత నిర్ణయం కారణంగా అనేక మంది విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లు లభించడం లేదు. దరఖాస్తులపై తనిఖీలు పెరగడంతో, విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా అమెరికా విశ్వవిద్యాలయాల నుండి వచ్చే అవసరమైన I-20 ఫారాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఒక 22 ఏళ్ల డేటా సైన్స్ విద్యార్థి మాట్లాడుతూ "ఇది మా కల. మా బంధువుల నుంచి డబ్బులు తీసుకుని అమెరికాక వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఇప్పుడు స్పష్టత లేకపోవడం వల్ల అమెరికా పట్ల మేము వెనుకడుగు వేస్తున్నాం. ఇంకా ప్రాసెస్ ఆరంభ దశలోనే ఉన్నందున ఇతర దేశాలపై దృష్టి పెడుతున్నాం" అని తన ఆవేదన వ్యక్తం చేశారు.
- నిపుణుల సూచనలు, జాగ్రత్తలు
విద్యా నిపుణులు విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలని, అన్ని డాక్యుమెంట్లూ సిద్ధంగా ఉంచుకోవాలని, నకిలీ ఏజెంట్లను నివారించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరిస్తున్నారు. అమెరికా అధికారులు దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్‌లోని I20 ఫీవర్ కన్సల్టెన్సీ అధినేత అర్వింద్ మందువా మాట్లాడుతూ "ఇప్పటికే చాలా మంది వీసా నిరాకరణలు, లాంగ్ ప్రాసెసింగ్ కేసులు ఎదుర్కొంటున్నారు. తాజా అడ్డంకి మరింత గందరగోళాన్ని తెస్తోంది. ఛాన్సులు పెరగాలంటే విద్యార్థులు రాజకీయ పంచులు, అబద్ధాలుగా కనిపించే పోస్టులు, అనుమానాస్పద కంటెంట్‌ను తక్షణమే తమ సోషల్ మీడియాలో నుండి తొలగించాలి" అని సూచించారు. ప్రస్తుతం I-20 ఫారాలు ఉన్న సుమారు 150-200 మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్నట్లు ఆయన తెలిపారు.
-అమెరికా కాన్సులేట్ వివరణ
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ స్పందిస్తూ "వీసా దరఖాస్తుల్లో సోషల్ మీడియా వివరాలు ఇవ్వాలనే నిబంధన 2019 నుంచే అమలులో ఉంది. సెక్యూరిటీ వెరిఫికేషన్ ప్రక్రియ అప్లికేషన్ సమయంలో.. వీసా చెల్లుబాటు అయ్యే కాలం అంతా కొనసాగుతుంది" అని స్పష్టం చేసింది.
ఈ పరిణామం తెలుగు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను పాటించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.