ఇండియాకొచ్చేస్తాం.. భారతీయ విద్యార్థుల్లో ఆందోళన

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.;

Update: 2025-06-14 14:30 GMT

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌లోని కీలక అణు, సైనిక స్థావరాలపై బాంబు దాడులు జరిపిన నేపథ్యంలో, ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు తమను తక్షణమే స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందన్న భయంతో విద్యార్థులు వణికిపోతున్నారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెడికల్ సైన్సెస్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూనివర్శిటీ అధికారులు వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, విద్యార్థుల్లో భయభ్రాంతులు వీడలేదు. "ఉదయం 3:30 గంటల సమయంలో జరిగిన దాడుల అనంతరం నేల కంపించిన అనుభూతి కలిగింది. ప్రస్తుతం పరిస్థితి శాంతియుతంగానే ఉన్నప్పటికీ టెహ్రాన్ మొత్తం భయంతో నిండిపోయింది" అని రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి ఒకరు భారత మీడియాకు తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి మాట్లాడుతూ "విద్యార్థులంతా తమ పూర్తి చిరునామా, ఫోన్ నంబర్లు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ బంద్ చేయడంతో సమాచారం పొందడం కష్టంగా మారింది. పరిస్థితి మరింత క్షీణిస్తే తక్షణం తరలింపు అవసరమవుతుందని భావిస్తున్నాం" అన్నారు.

ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ విద్యార్థుల సంఘం భారత విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌కు లేఖ రాసింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను తక్షణమే రక్షించాలని, వారిని సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేయడం, సైనిక చర్యలు ఎక్కువవడం వంటి పరిణామాలు విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు వినిపించడంతో పాటు భూకంపం లాంటి ప్రకంపనలు కనిపించాయని వారు తెలిపారు.

ఇజ్రాయెల్ శుక్రవారం ఇరాన్‌పై సైనిక దాడిని ప్రారంభించింది. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశ్యంతో తాము ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. నతాంజ్ అణు కేంద్రంతో పాటు రాడార్ స్టేషన్లు, సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ కేంద్రాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ధృవీకరించారు.

ఇక, ఇరాన్ కూడా ప్రతీకార చర్యగా డ్రోన్ల దళాన్ని ఇజ్రాయెల్ వైపు పంపింది. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమెనెయి "ఇజ్రాయెల్ దాడులకు తీవ్ర ప్రతీకారం చెల్లించాల్సి ఉంటుంది" అని హెచ్చరించారు.

ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. విద్యార్థుల భద్రత, వారి తరలింపు విషయంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఎదురు చూస్తున్నాయి.

Tags:    

Similar News