వంశీ @ 68 డేస్.. ఇప్పట్లో ఊరట దక్కదా?
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు వాయిదా వేసింది.;
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 13న సత్యవర్థన్ కిడ్నాపు కేసులో అరెస్టు అయిన వంశీ సుమారు 68 రోజులుగా జైలులోనే రిమాండు ఖైదీగా ఉన్నారు. తొలుత సత్యవర్థన్ కిడ్నాపు కేసులో అరెస్టు అయిన వంశీపై వరుసగా వివిధ కేసులు నమోదు చేయడంతో ఆయన అనేక చిక్కుముళ్ల మధ్య చిక్కుకుపోయారంటున్నారు. దాదాపు ప్రతి కేసులోనూ కోర్టు రిమాండ్ విధిస్తుండటంతో వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించడం లేదంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. గన్నవరంలో స్థలం ఆక్రమణ అభియోగాలు ఎదుర్కొంటున్న వంశీకి బెయిల్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది. వంశీ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాది గడువు కోరడంతో హైకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.
గన్నవరం టీడీపీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ గా గతంలో పనిచేసిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారనే ఆరోపణతో వంశీని తొలుత అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత వంశీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పిటీ వారెంటుపై ఆయనను పోలీసులు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, భూ ఆక్రమణలు, బెదిరింపులు వంటి కేసులు నమోదు అయ్యాయి. వీటిలో దేనికి ఇంతవరకు బెయిల్ లభించలేదని చెబుతున్నారు. దీంతో జైలులో ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై పరుష పదజాలం వాడటమే వంశీకి ఇన్ని కష్టాలు వెంటాడుతున్నాయని అంటున్నారు. ఆయన విషయంలో కఠిన వైఖరి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో బెయిల్ పై విడుదలకు పోలీసులు సహరించడం లేదంటున్నారు. వంశీ తర్వాత అరెస్టు అయిన వారిని బెయిల్ వస్తున్నా, వంశీకి ఊరట దక్కకపోడంపైనే చర్చ జరుగుతోంది. సుమారు 68 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండు పొడిగిస్తూనే ఉన్నారు. దీంతో వంశీ ఎప్పుడు బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.