చంద్రబాబు సర్కారు భూ కేటాయింపులపై హైకోర్టు సంచలన తీర్పు.. రాష్ట్ర అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు

పారిశ్రామిక అవసరాలకు భూముల కేటాయింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అండగా నిలిచింది.;

Update: 2025-07-31 10:06 GMT

పారిశ్రామిక అవసరాలకు భూముల కేటాయింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అండగా నిలిచింది. ఐటీ పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) వంట సంస్థలకు భూములు కేటాయించడం తప్పేమీ కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలనే ఉందని అభిప్రాయపడిన ఉన్నత న్యాయస్థానం భూమిని ఎంత రేటుకు ఇస్తున్నామన్న విషయం చూడకూడదని, టీసీఎస్ లాంటి సంస్థ రాష్ట్రానికి రావడం వల్ల జరిగే ప్రయోజనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఐటీ వృద్ధి కారణంగా హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో చూస్తున్నాం కదా? అంటూ వ్యాఖ్యానించింది.

విశాఖలో టీసీఎస్ కంపెనీకి నామమాత్రపు ధరకు భూములను కేటాయించడం సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలిస్తే తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో భూమిని కేటాయించి ఉండొచ్చని పేర్కొంది. టీసీఎస్ రూ.1,370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్కువ ధరకు భూములివ్వడంతోపాటు వివిధ ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని గుర్తు చేసింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభదశలోనే ఉందని, టీసీఎస్ రావడం వల్ల జరిగే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఐటీ పరిశ్రమ కారణంగా ఏ స్థితిలో ఉన్నాయో చూస్తున్నాం కదా? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. టీసీఎస్ కు లీజు పద్ధతిలోనే భూమిని కేటాయిస్తున్నామని, సేల్ డీడ్ ద్వారా విక్రయిస్తున్నామన్న వాదనలో వాస్తవం లేదన్న ఎస్జీపీ వాదనను నమోదు చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags:    

Similar News