లైన్ క్రాస్ చేయొద్దు.. పోలీసులకు సుప్రీం తాజా హెచ్చరిక!

పౌరుల అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలే తప్పించి.. పరిధి దాటే అంశంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహానని వ్యక్తం చేసింది.;

Update: 2025-04-03 06:30 GMT

పౌరుల అరెస్టు విషయంలో పోలీసులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలే తప్పించి.. పరిధి దాటే అంశంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహానని వ్యక్తం చేసింది. పౌరులు పరిది దాటొచ్చేమో కానీ.. పోలీసులు మాత్రం పరిధులు దాటేందుకు ఏమాత్రం వీల్లేదంటూ సీరియస్ హెచ్చరిక జారీ చేసింది. పోలీసులు పరిధులు దాటుతున్నట్లుగా తమ వరకు వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.

అదే సమయంలో అరెస్టుల వేళ మెజిస్ట్రేట్లు వ్యవహరించే తీరుపైనా ఘాటు వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పౌరుల అరెస్టు వేళ మెజిస్ట్రేట్లు తగిన నిర్ణయాన్ని వెలువరించటానికి ముందు జాగ్రత్తగా తమ మెదళ్లను ఉపయోగించాలే తప్పించి రోటీన్ గా వ్యవహరించకూడదని స్పష్టం చేసింది. తమ ఆదేశాల కాపీని దేశంలోని అన్ని రాష్ట్రాల డీజీపీలకు పంపాలని స్పష్టం చేయటం గమనార్హం. ఈ విస్పష్ట ఆదేశాల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం వెలువరించింది. ఇంత తీవ్ర వ్యాఖ్యలకు కారణమేంటి? అసలేం జరిగింది? ఏ కేసు విషయంలో ఈ వ్యాఖ్యలు చేసిందన్న అంశంలోకి వెళితే..

హర్యానాకు చెందిన విజయ్ పాల్ కు.. తమ పొరుగింటి వ్యక్తి అయిన మమతా సింగ్ తదితరులతో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు విజయ్ పాల్ ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు పేరుతో పోలీసులు తన పట్ల చట్టవిరుద్ధంగా వ్యవహరించటంతో పాటు తనను కొట్టారని విజయ్ పాల్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అర్నేష్ కుమార్ కేసులో సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లుగా హైకోర్టుకు నివేదించారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు 2023లో కొట్టేసింది. దీంతో విజయ్ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఘటనాస్థలంలోనూ.. తర్వాత పోలీస్ స్టేషన్ లోనూ పోలీసులు తనపై దాడికి పాల్పడిన వైనాన్ని సుప్రీం ద్రష్టికి తీసుకొచ్చారు. తన అరెస్టు గురించి తన సోదరుడు జిల్లా ఎస్పీకి ఈమొయిల్ పంపారని.. దీంతో పోలీసులు మరింత రెచ్చిపోయి.. తనను కస్టడీలోకి తీసుకున్న రెండు గంటల తర్వాత కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ హర్యానా డీజీపీ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో డీజీపీ సుప్రీంకోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. పలు విచారణల అనంతరం గత వారం ఈ కేసుకు సంబంధించిన విచారణను మరోసారి జస్టిస్ అమానుల్లా నేత్రత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

కోర్టు ఎదుట ఉంచిన రికార్డుల్ని పరిశీలించిన న్యాయస్థానం.. విజయ్ పాల్ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని తేల్చింది. ఒక వ్యక్తి నేరస్తుడైనప్పటికి అతడి విషయంలోనూ చట్ట ప్రకారమే వ్యవహరించాలని చట్టం చెబుతుందన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేస్తూ.. విజయ్ పాల్ మీద కింది కోర్టు విచారణ జరుపుతున్న కారణంగా కేసును మూసివేస్తున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు.. తమ కింది అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తే ఉపేక్షించేదే లేదన్న రీతిలో చర్యలు తీసుకోవాలని డీజీపీకి స్పష్టం చేసింది. ఒక వ్యక్తి అరెస్టు విసయంలో పోలీసులకు అధికారాలు కల్పిస్తున్న సీఆర్ పీసీ సెక్షన్ 41(1) (బి) (2)లో నిర్దేశించిన చెక్ లిస్టుపై తాము ఏమాత్రం సంతృప్తిగా లేమని స్పష్టం చేయటం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News