లవ్ ఫెయిల్ తో సూసైడ్ చేసుకుంటే.. ఆమె తప్పు కాదంతే!

లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటే.. అతగాడు ప్రేమించిన మహిళకు ఎలాంటి బాధ్యత ఉండదన్న విషయాన్ని తాజాగా కోర్టు స్పష్టం చేసింది

Update: 2024-03-04 06:05 GMT

లవ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటే.. అతగాడు ప్రేమించిన మహిళకు ఎలాంటి బాధ్యత ఉండదన్న విషయాన్ని తాజాగా కోర్టు స్పష్టం చేసింది. ప్రేమ వైఫల్యంతో మానసిక క్షోభకు గురైన యువకుడి ఆత్మహత్యకు సదరు యువతి ఎందుకు కారణమవుతుందన్న ప్రశ్నను న్యాయస్థానం సంధించింది. అంతేకాదు.. ఆత్మహత్యకు సదరు మహిళ ప్రేరేపించిందని పేర్కొంటూ శిక్ష విధించలేమని స్పష్టం చేసింది. తాజాగా ముంబయి కోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది.

ప్రేమను కాదన్న కారణంగా మానసిక సంఘర్షణకు గురై.. ఆత్మహత్యకు గురయ్యే ఉదంతాల్లో సదరు యువతికి శిక్ష విధించాలన్న నిబంధనలు చట్టంలో లేవన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. ముంబయి అదనపు సెషన్స్ జడ్జి ఎన్ పీ మెహతా ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనీషా.. నితిన్ లు తొలుత ప్రేమించుకొని ఆ తర్వాత విడిపోయారు. ఆ తర్వాత మనీషా రాజేశ్ అనే వ్యక్తితో స్నేహం చేసింది.

అయినప్పటికీ మనీషాను తొలుత ప్రేమించిన నితిన్ వెంటపడుతూనే ఉండేవాడు. అయినప్పటికీ ఆమె అతడి ప్రేమను అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన నితిన్ 2016 జనవరి 15న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి ఆత్మహత్యకు మనీశా.. రాజేష్ లే కారణమని పేర్కొంటూ కేసును నమోదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారణ వేళలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లవ్ ఫెయిల్ అయి ఒక యువకుడు మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకుంటే.. సదరు యువతి ఎందుకు బాధ్యత వహించాలన్న ప్రశ్నతో పాటు.. లవ్ ఫెయిల్యూర్ ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేమన్నారు. అయితే.. ఇక్కడే ఇంకో విషయాన్ని ముంబయి కోర్టు చెప్పింది. ఇష్టం వచ్చినట్లుగా ప్రియుడ్ని మార్చటం నైతికంగా తప్పేనని.. కానీ ఆత్మహత్యకు ప్రేమికురాలే కారణమని కేసు పెట్టే అవకాశం ఉండదని మాత్రం స్పష్టం చేశారు.

Tags:    

Similar News