ఉద్యోగాలు రద్దు.. విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్
కష్టాల్లో ఉన్నామని ఆదుకోవడానికి ఇచ్చిన 'ఆసరా'.. చట్టం ముందు నిలవలేకపోయింది! కరూర్ ఘటనలో తమ వారిని కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న ఆ బాధిత కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగం కాస్త కోలుకునేందుకు ఒక చిన్న ఆశాదీపమైంది.
కష్టాల్లో ఉన్నామని ఆదుకోవడానికి ఇచ్చిన 'ఆసరా'.. చట్టం ముందు నిలవలేకపోయింది! కరూర్ ఘటనలో తమ వారిని కోల్పోయి తీరని దుఃఖంలో ఉన్న ఆ బాధిత కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగం కాస్త కోలుకునేందుకు ఒక చిన్న ఆశాదీపమైంది. కానీ హైకోర్టు తీర్పుతో ఆ వెలుగు క్షణాల్లో ఆరిపోయింది. చేతికి అందివచ్చిన ఉద్యోగ నియామక పత్రాలు రద్దు కావడంతో మళ్లీ తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న వేదనలో ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నియామకాలను కోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఎవరికి కావాలంటే వారికి ఇవ్వడానికి కాదని.. రాజ్యాంగ నిబంధనలు, అర్హతలు, నియామక ప్రక్రియలకు లోబడి మాత్రమే భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులను దాటకూడదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
కరూర్‌లో జరిగిన భారీ సభలో నిర్వహణ లోపాల కారణంగా తొక్కిసలాట చోటుచేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించిన విజయ్, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇటీవల ప్రభుత్వం 32 మంది బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేయడంతో పాటు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించింది.
అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ ఉద్యోగాలను ఈ విధంగా ప్రత్యేకంగా కేటాయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తేల్చిచెప్పింది. ప్రమాదాలు లేదా విపత్తులు సంభవించినప్పుడు బాధిత కుటుంబాలకు పరిహారం, పునరావాసం, ఇతర సంక్షేమ చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యతేనని, కానీ ప్రభుత్వ ఉద్యోగాలను ప్రత్యేక ప్యాకేజీగా ఇవ్వడం సమాన అవకాశాల సూత్రాన్ని దెబ్బతీస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
ఈ తీర్పుతో విజయ్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా పోలీసులపై చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అదే సమయంలో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నించిందనే విమర్శలు కూడా వినిపించాయి.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దాడిని మరింత తీవ్రం చేశాయి. ప్రభుత్వ నిర్ణయం మొదటి నుంచే చట్టబద్ధం కాదని తాము చెబుతున్న విషయాన్నే హైకోర్టు సమర్థించిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తీర్పు డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలకు విజయ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొత్త రాజకీయ అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు ఉద్యోగాలు లభించాయని భావించి కొత్త జీవితంపై ఆశలు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు ఈ తీర్పు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉద్యోగ నియామకాలు రద్దు కావడంతో వారి భవిష్యత్‌పై మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ సహాయ చర్యలు ప్రకటిస్తుందా? లేక తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్‌కు వెళ్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.