విజయసాయి చెప్పాడు.. రాజ్ కసిరెడ్డి ఇరుక్కున్నాడు!!

ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలకు వరుస ఎదురుదెబ్బలే తగులుతున్నాయి.;

Update: 2025-04-04 10:31 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలకు వరుస ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి బుధవారం ముందస్తు బెయిల్ తిరస్కరించగా, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్ కసిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖరరెడ్డిని సాక్షిగా పేర్కొంటూ విచారణకు రావాల్సిందిగా ఏపీ సీఐడీ సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులిచ్చింది. అయితే ఈ నోటీసులను రద్దు చేయాలని ఆయన హైకోర్టు వెళ్లగా, అందుకు ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ తిరస్కరించిన మరునాడే రాజ్ కసిరెడ్డి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడం చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో సాక్షిగా పరిగణిస్తూ రాజ్ కసిరెడ్డిని విచారణకు రమ్మంటే ఆయన సీఐడీ నోటీసులను కొట్టివేయాలని కోర్టుకు వెళ్లడంపైనా చర్చ జరుగుతోంది. అయితే, సీఐడీ చట్టప్రకారమే నడుచుకుందని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం రాజ్ కసిరెడ్డి పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సివుంటుందని న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రాజ్ కసిరెడ్డి పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు ఆయనకు మరోమారు నోటీసులు ఇవ్వాలని సీఐడీ అధికారులకు సూచించింది. అదేవిధంగా తదుపరి విచారణకు నోటీసు జారీ చేసే ముందు సహేతుకమైన సమయం ఇవ్వాలని కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఊరు, పేరు లేని లిక్కర్ బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్లచేశారని అప్పటి ప్రభుత్వ పెద్దలపై ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో లిక్కర్ అమ్మకాలు, తయారీలో స్కాం జరిగిందని బయటపడితే రాజకీయంగా కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని నరసారావుపేట ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిణామాల మధ్య లిక్కర్ స్కాంపై ప్రభుత్వం వ్యవహరంచే తీరు వైసీపీని అందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News