సర్వీస్ ఛార్జీల పేరిట ఇంత భారం మోపుతారా?..
హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లులకు సర్వీస్ ఛార్జీలు జోడించే పద్ధతిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.;
హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లులకు సర్వీస్ ఛార్జీలు జోడించే పద్ధతిపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు మళ్లీ సేవా రుసుము పేరుతో కస్టమర్లపై భారం మోపడం సరికాదని వ్యాఖ్యానించింది.
సీసీపీఏ పిటిషన్
మార్చిలో సింగిల్ జడ్జి బెంచ్ సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా పిటిషన్లు దాఖలు చేయగా, వాటిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కఠిన వ్యాఖ్యలు చేసింది. ‘‘రెస్టారంట్లు మూడు విధాలుగా కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. పదార్థాల విక్రయం, సర్వ్ చేయడం, వాతావరణం కల్పించడం పేరుతో వసూలు చేస్తున్నారు. రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.100గా మెనూలో చూపుతున్నప్పుడు, అదనంగా సేవా రుసుము ఎందుకు?’’ అని ప్రశ్నించింది.
వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, సర్వీస్ ఛార్జీల చెల్లింపు కస్టమర్ ఇష్టానికి మాత్రమే పరిమితమని, వాటిని బిల్లులో తప్పనిసరిగా చేర్చరాదని స్పష్టం చేసింది. కోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది.
కేంద్ర ప్రభుత్వం 2017లోనే సర్వీస్ ఛార్జీలు పన్నుల కిందకు రావని స్పష్టం చేసింది. వాటిని వినియోగదారుడి అంగీకారంపై మాత్రమే వసూలు చేయాలని, అన్ని హోటళ్లు ఈ మేరకు బోర్డులు ప్రదర్శించాలని ఆదేశించింది. అయినప్పటికీ అనేక హోటళ్లు ఇప్పటికీ బిల్లుల్లో సేవా రుసుమును బలవంతంగా చేర్చుతున్నాయని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.