రష్యాపై ఆంక్షలకు..ఇండియాపై ట్రంప్ టారిఫ్ లకు జెలెన్స్కీ మద్దతు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి కోరారు.;
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ, రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి కోరారు. రష్యాపై తాజాగా జరిగిన అతిపెద్ద వైమానిక దాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "రష్యాతో ఇప్పటికీ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధించడం సరైన ఆలోచన" అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు, ఇటీవల మోడీ-షీ-పుతిన్ సమావేశం తర్వాత రావడం గమనార్హం.
ఈ సందర్బంలోనే ట్రంప్ ప్రకటించిన భారతపై సుంకాల విధానాన్ని వెనక్కి తీసుకోవాలా అనే ప్రశ్నకు జెలెన్స్కీ మద్దతుగా స్పందించారు. కేవలం మాటలతో కాకుండా వాణిజ్య పరిమితులు, సుంకాల ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకురావచ్చని ఆయన అన్నారు.
*రష్యా దాడులు: కీవ్‌లో భయం
రష్యా శనివారం రాత్రి ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు అతిపెద్ద వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో 800కి పైగా డ్రోన్లు, 13 క్షిపణులు ఉపయోగించినట్లు సిఎన్ఎన్ నివేదిక తెలిపింది. బెలారస్ వైపు నుంచి కూడా కొన్ని డ్రోన్లు వచ్చాయని సమాచారం. ఈ దాడుల్లో కీవ్‌లోని కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ భవనం తీవ్రంగా దెబ్బతింది, పలు నివాస భవనాలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఒక శిశువుతో సహా ఇద్దరు మరణించారు. దాదాపు 11 గంటలపాటు కీవ్‌లో ఎయిర్ సైరన్లు మోగాయి, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రూరమైన దాడులతో రష్యా ఉక్రెయిన్‌ను బలహీనపరచాలని ప్రయత్నిస్తుందని, ఇది ప్రపంచాన్ని పుతిన్ పరీక్షిస్తున్న సంకేతమని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు.
*ట్రంప్ హెచ్చరిక
ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పుతిన్‌ను నేరుగా శిక్షించే దిశగా వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన "అవును, నేను సిద్ధమే" అని సమాధానమిచ్చారు. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.