బాబాయ్ మీద బరువు బాధ్యతలు
వైసీపీ అధినేత జగన్ కీలకమైన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రకాశం జిల్లా బాధ్యతలను బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారని అంటున్నారు.;
వైసీపీ అధినేత జగన్ కీలకమైన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రకాశం జిల్లా బాధ్యతలను బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారని అంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. ఆ జిల్లాకే చెందిన వైవీ సుబ్బారెడ్డి వల్ల పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని ఆశిస్తున్నారు.
ఇప్పటిదాకా జిల్లా బాధ్యతలను చూసిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని తప్పించారు అని అంటున్నారు. ఆయన స్థానికేతరుడు అన్న ముద్రతో పార్టీలో దూకుడుగా పని చేయలేక పోతున్నారు అని అంటున్నారు. ఇక చూస్తే ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీ బలాలు చెరి సమానంగా ఉన్నాయి. మధ్యలో జనసేన కూడా తన వాటాను తీసుకుంటోంది.
వైసీపీ ప్రభంజనం లో సైతం టీడీపీ ఈ జిల్లాలో మంచి రాజకీయ ప్రదర్శన చేసింది. కీలక నియోజకవర్గాలలో జెండా పాతింది. ఇపుడు టీడీపీకి తోడు జనసేన కూడా పొత్తు కలవడంతో జిల్లాలో రాజకీయం ఏకపక్షంగా సాగుతోంది అని అంటున్నారు. మాజీ మంత్రి వైసీపీలో ఒకనాడు ప్రాధాన్యత కలిగిన నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి చేరడంతో జిల్లాలో వైసీపీని నడిపించే నాయకుడు కరవు అయ్యారని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఒంగోలు ఎంపీ సీటు నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ చేసి ఓటమి పాలు అయ్యాక ఈనాటి వరకూ ఆయనే జిల్లా బాధ్యతలు మోస్తున్నారు. కానీ పార్టీ ఎత్తిగిల్లడంలేదు అని అంటున్నారు. దాంతో వైసీపీ హైకమాండ్ చేస్తున్న రిపేర్లలో భాగంగా వైవీకే పగ్గాలు అప్పగించింది అని అంటున్నారు.
దాంతో తొందరలోనే వైవీ సుబ్బారెడ్డి జిల్లా బాధ్యతలను స్వీకరిస్తారని ప్రచారం సాగుతోంది. కోస్తా జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం గుండే కాయ లాంటి జిల్లా అయిన ప్రకాశంలో వైసీపీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని అధినాయకత్వం భావిస్తోంది.
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో ఓటమి చెందినా పార్టీ మళ్ళీ జవసత్వాలు తెచ్చుకుని స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నిలబడాలని జగన్ భావిస్తున్నారు. పార్టీలో నిరాశాపూరితమైన వాతావారణం ఉందని అంటున్నారు. దాంతో పార్టీ బరువు బాధ్యతలను బాబాయ్ మీదనే పెట్టారని అంటున్నారు.
వైసీపీకి రాజకీయ ప్రకాశం తెచ్చే విధంగా వైవీ ఏ విధంగా వ్యూహరచన చేస్తారు అన్నది చూడాలి ఉంది. వైసీపీలో అనేక నియోజకవర్గాలలో నాయకులు సైతం సైలెంట్ అయ్యారు. కూటమి జోరు హుషార్ అంతటా కనిపిస్తోంది. మళ్ళీ పార్టీని గాడిలో పెడితేనే తప్ప అంతా సర్దుబాటు కాదని అంటున్నారు.