సెవెన్‌ సిస్టర్స్‌ పై యూనస్ కన్ను.. పాక్ లాగా బంగ్లాదేశ్ కు ఇచ్చిపడేయాలి

శాంతికాముక దేశమని భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాకిస్తాన్ కు ఇప్పుడు తత్త్వం బోధపడింది.;

Update: 2025-05-15 05:00 GMT

శాంతికాముక దేశమని భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోసిన పాకిస్తాన్ కు ఇప్పుడు తత్త్వం బోధపడింది. భారత్ ఏకంగా దాడులకు దిగడంతో తోకముడిచింది. శరణుజొచ్చింది. ఇండియా దాడి చేయదులే అని చెలరేగిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు కాళ్లబేరానికి వస్తోంది. అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా రెచ్చిపోతోంది. షేక్ హసీనాను దించేసి గద్దెనెక్కిన యూనస్ భారత వ్యతిరేకతతో చైనా, అమెరికాలకు అన్ని అప్పగించేస్తున్నారు. భారత ఈశాన్య రాష్ట్రాలపై విషం కక్కుతున్నారు. దీంతో పాక్ లాగా బంగ్లాదేశ్ కు ఓసారి భారత దెబ్బ రుచిచూపిస్తే బెటర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మహమ్మద్‌ యూనస్ భారత్ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోసారి ఆయన భారత ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. బంగ్లాదేశ్‌, నేపాల్, భారత ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో ఈ ప్రాంతాల మధ్య సహకారం ముఖ్యమంటూ ఆయన మాట్లాడారు.

ఇటీవల నేపాల్ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ సందర్భంగా యూనస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్‌కు క్రమంగా దూరమవుతున్న బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌, చైనాతో సంబంధాల కోసం ఆరాటపడుతూ ఈ తరహా వైఖరిని ప్రదర్శిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత నెల యూనస్‌ చైనాలో పర్యటించిన సందర్భంగా.. బంగ్లాదేశ్‌లో డ్రాగన్ తన కార్యకలాపాలు విస్తరించుకోవచ్చంటూ ఆయన ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.

అక్కడితో ఆగకుండా భారత ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి అంతకుముందు యూనస్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. "భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్‌ సిస్టర్స్ అంటారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. వారు సముద్రానికి చేరుకోవడానికి వేరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో సముద్రానికి మేమే రక్షకులం. కాబట్టి ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది" అని యూనస్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది.

ఈ వ్యాఖ్యలపై భారత్ నుంచి బలమైన స్పందన వచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ దీటుగా బదులిచ్చారు. "బంగాళాఖాతం చుట్టూ ఉన్న, దాని సమీపంలోని దేశాలకు ఉమ్మడి ఆసక్తులు, ఆందోళనలు రెండూ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి మన చరిత్ర దోహదం చేసింది. ఇతర ప్రాధాన్యాలు ఈ ప్రాంత శ్రేయస్సును పక్కనపెట్టాయి. బంగాళాఖాతంలో భారత్‌కు 6,500కి.మీ. మేర పొడవైన తీరరేఖ ఉంది. భారతదేశం ఐదు బిమ్స్‌స్టెక్ సభ్య దేశాలతో సరిహద్దును కలిగి ఉంది. అలాగే ఆసియాన్ దేశాలతో అనుసంధానాన్ని అందిస్తోంది. ముఖ్యంగా మా ఈశాన్య ప్రాంతం బిమ్స్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా వృద్ధి చెందుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌లతో ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజంగా గేమ్ ఛేంజర్" అని జైశంకర్ గట్టి బదులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా, భారత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురలను సెవెన్‌ సిస్టర్స్‌గా పిలుస్తారు. యూనస్ వంటి ఉన్నతస్థాయి నాయకుడి నుంచి పదే పదే ఈ ప్రాంతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది.

Tags:    

Similar News