జగన్ బలం సరిపోదా...మరేం చేయాలి ?

ఏడాది కాలంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి పవర్ ఫుల్ గా మారింది. రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలోని ప్రభుత్వం సహకారం ఉంది.;

Update: 2025-06-11 07:30 GMT

ఏడాది కాలంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి పవర్ ఫుల్ గా మారింది. రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలోని ప్రభుత్వం సహకారం ఉంది. అంతే కాదు మిత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన వెనక బలమైన సామాజిక వర్గం అలాగే పుష్కలమైన సినీ గ్లామర్ యువత మహిళల అండ ఇవన్నీ కూటమికి కొత్త శక్తిని ఇస్తున్నాయి. బీజేపీ మద్దతుతో మధ్యతరగతి ఉన్నత విద్యావంతులు, ఉన్నత వర్గాల మద్దతు మెండుగా దక్కుతోంది.

ఇక సమయానికి లోకేష్ అందుకుని వచ్చారు. చంద్రబాబు చాణక్య రాజకీయం ఉండనే ఉంది. దాంతో వైసీపీని పద్మ వ్యూహంలో ఇరికించి మరీ కకావికలం చేస్తునారు. ఇక వైసీపీ తీరు చూస్తే మొదటి నుంచీ ఒంటరి పోరుగా ఉంది. మిత్రులు ఎవరూ లేరా లేక కలసి రారా అన్నది తెలియదు కానీ పైన దేవుడు కింద ప్రజలు తోడుంటే చాలు అన్న పడిగట్టు పదాలతో జగన్ తన దశాబ్దన్నర రాజకీయాన్ని నెట్టుకుని వచ్చారు.

ఇందులో ఓటములు గెలుపులూ ఉన్నాయి. కానీ 2024లో ఎదురైంది భయంకరమైన ఓటమి. పైగా జగన్ ఏమిటి ఆయన పాలన ఏమిటి అన్నది జనాలు చూసేశారు. దాంతో దానిని మరపించేలా జనాలను ఆకట్టుకుని మళ్ళీ కుర్చీని అందుకోవడం అంటే అది చాలా కష్టసాధ్యమైన పని అంటున్నారు.

ఏపీలో రాజకీయ పరిస్థితులు చూసుకుంటే విపక్షంలో ఉన్న కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ కూటమి కంటే కూడా వైసీపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యం ఉంది. దాంతో ఒంటరి పోరుతో వైసీపీ కూటమిని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఏడాది పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు.

వైసీపీ నేతలు అంతా మౌనం దాల్చారు అంటే కేసుల మీద కేసులు పెడుతూ కూటమి ప్రభుత్వంలో చేస్తున్న కార్యక్రమాల వల్లనే అని అంటున్నారు. ఏముంది కళ్ళు మూసుకుంటే మరో నాలుగేళ్ళే కదా కేసులకు జైళ్ళకు భయమెందుకు అని జగన్ ఎంత చెప్పినా వాటిని ఎదుర్కొనే వారికే ఆ బాధ భయం తెలుస్తాయని అంటున్నారు.

పైగా కొందరు నేతల మీద కేసుల మీద కేసులు పెట్టి మరీ బెయిల్ ఒక కేసులో వస్తే మరో కేసులో జైలులో ఉంచే సీన్ కనిపిస్తోంది. దీనిని చూసిన వైసీపీ నేతలలో చాలా మందికి నైతిక స్థైర్యం దెబ్బ తింటోంది అని అంటున్నారు. ఇక కేంద్రంలో బలంగా ఎన్డీయే సర్కార్ ఉంది. మోడీ బాబు పవన్ జోడీతో ఏపీలో అద్భుతాలే అని నమ్మే వారు ఉన్నారు.

దాంతో ఏడాది గడచిన తరువాత చూసుకుంటే పధకాలు అమలు చేయలేదన్న అసంతృప్తి అయితే కూటమి ప్రభుత్వం మీద ఉన్నా అది వైసీపీకి గ్రాఫ్ పెంచేలా కలసి రావడం లేదు అని అంటున్నారు. ఇక కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో వైసీపీ ఉందని అంటున్నారు.

దాంతో కూటమి మీద ఒంటరి యుద్ధం కంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీతో కానీ కూటమితో కాని జట్టు కట్టి ముందుకు సాగితేనే వైసీపీకి కొత్త బలం కొత్త ఉత్సాహం వస్తాయని అంటున్నారు. దీని మీద తెలంగాణాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచ ఐలయ్య అయితే జగన్ కి మంచి సూచనలు సలహాలే ఇచ్చారు.

జగన్ కి కాంగ్రెస్ తో విభేదాలు ఉంటే వేరే ఇతర పార్టీలతో అయినా సఖ్యతను నెరిపి జాతీయ స్థాయిలో పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఏపీలో కూటమిని కట్టడి చేయగలరని అంటున్నారు అలా కాకుండా గతంలో మాదిరిగా పాత కాలం రాజకీయం చేస్తామంటే మాత్రం కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. మొత్తానికి చూస్తే కూటమి ఎత్తులు వ్యూహాల ముందు జగన్ బలం ఏ మాత్రం సరిపోవడం లేదని విశ్లేషణలు అయితే ఉన్నాయి. జగన్ జట్టు కట్టాల్సిందే అని లేకపోతే వైసీపీకి 2029 ఎన్నికలు అతి పెద్ద సవాల్ గా మారుతాయని అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం ఏమి ఆలోచించుకుంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News