వైసీపీ వ్యూహ- ప్రతివ్యూహాలు.. అసలు మ్యాటర్ ఇదే..!
ఆ తర్వాత.. మిర్చి, పొగాకు రైతుల పక్షాన వాయిస్ వినిపించాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడు.. కాకాణి అరెస్టు, అదేవిధంగా ఇతర నాయకులకు నోటీసులు ఇలా..;
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ముందు ముందు పుంజుకునేందుకు.. చేస్తున్న ప్రయత్నాలకు... సర్కా రు మరో రూపంలో గండికొడుతోంది ముఖ్యంగా ఎప్పుడైతే పుంజుకునేందుకు రెడీ.. అంటూ అడుగులు పడుతున్నాయో.. అప్పుడే ఏదో ఒక కేసు తెరమీదికి వస్తోంది. దీంతో సదరు కార్యక్రమం డైవర్ట్ అవుతోంది. ఉదాహరణకు ఫీజు రీయింబర్స్‌మెంటు, విద్యార్థుల సమస్యలపై ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు.. మద్యం కేసులో తొలి అరెస్టు నమోదైంది. రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత.. మిర్చి, పొగాకు రైతుల పక్షాన వాయిస్ వినిపించాలని జగన్ నిర్ణయించుకున్నప్పుడు.. కాకాణి అరెస్టు, అదేవిధంగా ఇతర నాయకులకు నోటీసులు ఇలా.. అవి యాదృచ్ఛికమే అయినా.. సర్కారు మా త్రం దూకుడుగానే ముందుకు సాగింది. తద్వారా.. వైసీపీ వ్యూహానికి ప్రతివ్యూహం అన్నట్టుగా.. ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కనిపించాయి. దీంతో ప్రభుత్వంపై పోరాడేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యూహ రచన ఎప్పటికప్పుడు డింకిలు కొడుతోంది. తాజాగా టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
దీనికి ముందు వైసీపీ నాయకులు కూడా.. `బాబు మేనిఫెస్టో` పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ, అటు ఆ కార్యక్రమం ఎలా ఉన్నా.. ఇటు టీడీపీ కార్యక్రమం మాత్రం అంతో ఇంతో ప్రజలకు చేరువ అయింది.కొన్ని చోట్ల వైసీపీ నాయకులపై విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకుండా.. ఎందుకిలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం కూడా అనుకున్న విధంగా అయితే.. వైసీపీకి మైలేజీ తీసుకురాలేక పోయిందన్నది వాస్తవం.
ఈ పరిణామాల క్రమంలోనే వైసీపీ అంతర్మథనంలో పడింది. ఏం చేయాలి? ఎలా ముందుకు సాగాలి? అనే విషయంపై చర్చలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా వెంటనే ఏదో ఒక కేసు తెరమీదికి రావడం.. దీంతో సదరు కార్యక్రమం పెద్దగా ప్రజలకు చేరడం లేదని నాయకులు గుర్తించారు. అందుకే.. ఈ సారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. అనుకున్న విధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. త్వరలోనే జగన్ `సమరభేరి` పేరుతో కార్యక్రమానికి రెడీ అవుతున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.