వారసులకు వైసీపీ మార్క్ షాక్ ?
వైసీపీలో వారసులు అనేక మంది ఉన్నారు. వారు 2024 ఎన్నికల్లోనే పోటీకి సిద్ధంగా ఉన్నారు.;
వైసీపీలో వారసులు అనేక మంది ఉన్నారు. వారు 2024 ఎన్నికల్లోనే పోటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆనాడు వైసీపీ అధినాయకత్వం వారికి అనుమతి ఇవ్వలేదు. ఆ ఎన్నికలు చాలా కీలకమైనవి అని భావిస్తూ తండ్రులనే రంగంలోకి దిగమని కోరింది. అయినా సరే కొన్ని చోట్ల అధినాయకత్వాన్ని మెప్పించి ఒప్పించి కొంతమంది తండ్రులు తమ బిడ్డలకు టికెట్లు తెచ్చుకున్నారు. అయితే అలాంటి చోట్ల కూడా దారుణమైన ఫలితాలు వచ్చాయి. దాంతో వైసీపీ హైకమాండ్ ఆలోచనలు ఒక్కసారిగా మారాయని అంటున్నారు. ఈసారి ఎన్నికలు 2024 కంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనవి అని వైసీపీ పెద్దలు భావిస్తున్నారుట. దాంతో వారసులకు నో చాన్స్ అన్న చర్చ అయితే ఫ్యాన్ పార్టీలో జోరుగా సాగుతోంది.
రెడీ కావాల్సిందే :
గత ఎన్నికల్లో తిరుపతి నుంచి భూమన కరుణాకరరెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి పోటీ చేశారు, అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మచిలీపట్నం నుంచి పేర్ని కిట్టూ పోటీ చేశారు. వీరంతా ఓటమి పాలు అయ్యారు. దాంతో ఈసారి వీరి ప్లేస్ లో తండ్రులనే రెడీ కావాలని వైసీపీ హైకమాండ్ సూచించింది అని అంటున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఇటీవల కాలంలో తిరిగి యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఆయన తరచూ మీడియా సమావేశాలు పెడుతున్నారు.
వీరి సంగతేంటి :
బూమన పార్టీ నేతలతో కూడా ఎక్కువగా సమావేశాలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తాను అని ఆయన సంకేతాలు ఇచ్చేశారు అని అంటున్నారు. తన కుమారుడికి రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని వైసీపీకి ఈ ఎన్నికలు ముఖ్యమైనవి కాబట్టి తానే పోటీకి సిద్ధం అని ఆయన అంటున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే తన కుమారుడినే పోటీకి పెట్టాలని చూస్తున్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి అదే ఆలోచనలో ఉన్నారు.
ఆశలు ఆవిరేనా :
ఇక ఏపీలో చూస్తే చాలా మంది వైసీపీ సీనియర్ నాయకులు తమ కుమారులకు లేదా కుమార్తెలను ఈసారి టికెట్ తెచ్చుకుని పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే కీలక స్థానాలలో తండ్రులే పోటీ పడితే మంచి రిజాల్ట్స్ వస్తాయనన్నది వైసీపీ హైకాండ్ బలమైన భావనగా ఉంది అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో చూస్తే బొత్స సత్యనారాయాణ తన కుమారుడిని చీపురుపల్లి నుంచి దించాలని చూస్తున్నారు. అలాగే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తన కుమార్తెకి టికెట్ కోరాలని చూస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు తమ కుమారులనే పోటీకి దించే యోచనలో ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లలఓ చూస్తే మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు కుమార్తెని మళ్లీ పోటీ చేయించాలని చూస్తున్నారు.
సీనియర్లను వదలకూడదని :
అయితే జగన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అన్నది చర్చగా ఉంది అంతే కాదు చాలా చోట్ల తండ్రులను ఎంపీలుగా బరిలోకి దించాలని కూడా అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. మరి ఆయా చోట్ల ఎవరికి అసెంబ్లీ టికెట్లు దక్కుతాయన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా సీనియర్ నేతలను తప్పించాలని టీడీపీ చూస్తూంటే వైసీపీ మాత్రం సీనియర్లను వదలకూడదని పట్టుదలగా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సహా కూటమి నేతలు యువ సైన్యంతో వస్తే వైసీపీ మీద ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకూ పనిచేస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది.