రైటిస్ట్ స్టాండ్ తో వ్యూహాత్మకంగా వైసీపీ ఓడిందా ?

ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఇపుడు జరగాల్సినవి కావు. 2027 ఆగస్టులో షెడ్యూల్ ప్రకారం జరగాలి.;

Update: 2025-09-10 03:55 GMT

ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఇపుడు జరగాల్సినవి కావు. 2027 ఆగస్టులో షెడ్యూల్ ప్రకారం జరగాలి. కానీ మధ్యలో జగదీప్ ధన్ ఖర్ రాజీనామా చేయడంతో తోసుకుని వచ్చాయి. దీని వల్ల దేశంలో ప్రతీ పార్టీ రంగు రుచి వాసన ఏమిటి అన్నది దేశం మొత్తం మరోసారి చూసే భాగ్యం కలిగింది. ఏ పార్టీది ఏ స్టాండ్ అన్నది కూడా తేటతెల్లమైంది. తెలుగు నాట చూస్తే బీఆర్ఎస్ వైసీపీల గురించే అంతా ఆలోచించారు. ఆ రెండు పార్టీలు తీసుకునే వైఖరుల మీదనే చర్చించారు. అయితే వైసీపీ తనదైన స్టాండ్ తీసుకుంది. అది ఎక్కువ మందికి ఆశ్చర్యం అయితే కలిగించలేదు. కానీ వైసీపీని మాత్రం విమర్శల పాలు చేసేలాగానే ఉంది అని అంటున్నారు.

లాజిక్ మిస్ అయ్యారా :

వైసీపీ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీయే అభ్యర్ధిగా నిలబెట్టిన సీపీ రాధాక్రిష్ణన్ కి ఓటేసింది. ఇదే ఇపుడు విపక్షంలోని ఇండియా కూటమికి కన్నెర్రగా ఉంది అంతే కాదు తటస్థంగా ఉండేవారు, మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంతా కూడా దీని మీదనే వైసీపీని విమర్శిస్తున్నారు. వైసీపీ లాజిక్ మిస్ అయింది అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు సైతం వైసీపీ ఏ విధంగా ఎన్డీయేకు మద్దతు ఇస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వైసీపీని ఓడించింది కూటమి. ఏపీలో అధికారంలో ఉన్నది ఎన్డీయే. అందులో బీజేపీ కూడా ఉంది. మరి వారికే ఓటేసి వారి మీద పోరాటం చేస్తామంటే అది వైసీపీ సిద్ధాంత రాహిత్యంగా కనిపించదా అన్న చర్చ కూడా సాగుతోంది.

వైసీపీ పునాది అదే :

ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాగించాలి అంటే సిద్ధాంత పునాది అన్నది ఉండాలి. అది లేకపోతే ఇబ్బందిలో పడుతుంది. ఏపీలో వైసీపీ రాజకీయ సిద్ధాంత భూమిక ఏమిటి అంటే లౌకిక వాదం, ప్రజాతంత్ర విధానం. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులకు వైసీపీ ఒక రాజకీయ వేదికగా ఉంది. అందుకే ఏపీలో బీజేపీ వైసీపీని టచ్ చేయలేకపోతోంది. అంతే కాదు టీడీపీ వంటి బలమైన పార్టీ సవాల్ చేసినా వైసీపీ తట్టుకుని నిలబడుతోంది. అధికార కూటమి భావజాలానికి వ్యతిరేకంగా మరో భావజాలం ఉంది. దానికి పార్టీ స్వరూపంగా వైసీపీ నిలిచింది. మరి ఆ భావజాలం ఆ మద్దతు అందుకుంటూ వైసీపీ ఎలా ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇస్తుంది అన్నదే చర్చగా ఉంది.

న్యూట్రల్ గా ఉన్నా ఓకే :

బీఆర్ఎస్ లేదా బిజూ జనతాదళ్ పార్టీల మాదిరిగా న్యూట్రల్ స్టాండ్ తో ఉన్నా వైసీపీకి బాగానే ఉండేది అన్న మాట ఉంది. తాము ఎవరి పక్షం కాదని తాము తటస్థంగా ఉంటామని చెప్పుకుని ఉంటే వైసీపీ రేపటి పోరాటాలకు ఊపు ఉత్సాహం వచ్చేవి. అలా కాదని ఎన్డీయేకు ఓటేసి అదే కూటమి మీద ఏపీలో పోరు చేస్తామంటే నమ్మేవారు ఉంటారా ఒకసారి ఆయా వర్గాల మద్దతు కోల్పోతే కనుక తిరిగి తెచ్చుకోవడం సాధ్యమయ్యే పనేనా అన్నది కూడా అంతా విశ్లేషిస్తున్న విషయంగా ఉంది.

కాంగ్రెస్ కి స్పేస్ ఉందా :

జగన్ మీద అపుడే కాంగ్రెస్ విమర్శలు మొదలెట్టింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అయిన మాణికం ఠాగూర్ అయితే బీజేపీ వ్యతిరేక భావజాలానికి జగన్ వెన్నుపోటు పొడిచారు అని ఘాటైన విమర్శలు చేసారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అయితే జగన్ ని మోడీకి దత్తపుత్రుడు అని మరోసారి గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. రేపటి రోజున వీటికి వైసీపీ ఏ విధంగా జవాబు చెప్పుకుంటుంది అన్నదే చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సిద్ధాంతాల పునాదిని దెబ్బ తీసుకుంటే అది ఇబ్బందులు తెచ్చి పెడుతుందని అంటున్నారు. రాజకీయంగా ఓడినా సిద్ధాంతపరంగా ఓటమి పాలు కాకూడదు అని అంటారు. మరి వైసీపీ తాను ఇచ్చిన ఈ మద్దతు మీద ఏ విధంగా సమర్ధించుకుని తిరిగి ఆయా వర్గాల మద్దతు పొందుతుంది అన్నదే ఆసక్తికరంగా ఉంది.

Tags:    

Similar News