వైసీపీలో మెగా జపం

వైసీపీలో ఇపుడు కొత్త జోష్ కనిపిస్తోంది. తాము పోగొట్టుకున్నది మళ్ళీ దక్కబోతోంది అన్న ధీమా అయితే కనిపిస్తోంది.;

Update: 2025-09-29 03:47 GMT

వైసీపీలో ఇపుడు కొత్త జోష్ కనిపిస్తోంది. తాము పోగొట్టుకున్నది మళ్ళీ దక్కబోతోంది అన్న ధీమా అయితే కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు తమకు అనుకూలిస్తున్నాయని కూడా భావిస్తోంది. మెగాస్టార్ లాంటి టవరింగ్ పర్సనాలిటీ జగన్ గురించి చెప్పిన మంచి మాటలను వైసీపీ మనస్పూర్తిగా స్వాగతిస్తూ ఆహ్వానిస్తోంది. చిరంజీవిని ఇపుడు ఆకాశానికి ఎత్తేస్తోంది. చిరంజీవి భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన మహా నటుడు అని గౌరవిస్తూ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంటోంది. ఎందుకు ఏమిటి అంటే అదే విషయం మరి.

బాలయ్యను టార్గెట్ చేస్తూ :

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా కూటమిని టార్గెట్ చేస్తోంది. ఎమ్మెల్యే బాలయ్యను తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో చిరంజీవిని వెనకేసుకుని వస్తోంది. చిరంజీవిని బాలయ్య అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సినిమా పరిశ్రమ సమస్యల గురించి చెప్పడానికి వెళ్ళినపుడు జగన్ తనను సమాదరించారు అని ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా చిరంజీవి ఒక్కసారిగా వైసీపీ వారి అభిమానాన్ని చూరగొన్నారు. దాంతో బాలయ్య జగన్ ని చిరంజీవిని విమర్శించడమేంటి అని సీనియర్ నేతలు మాజీ మంత్రులు అంతా విమర్శిస్తున్నారు.

ఆ సామాజిక వర్గం నేతలతో :

ఇక వైసీపీ నుంచి ఒక బలమైన సామాజిక వర్గం నేతలు ఈ విషయం మీద నోరు విప్పుతున్నారు. బిగ్ సౌండ్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణతో పాటు గుడివాడ అమర్నాధ్ అలాగే పేర్ని నాని వంటి వారు చిరంజీవికి కితాబు ఇస్తూనే కూటమిని చెడుగుడు ఆడిస్తున్నారు. కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పనిలో పనిగా మెగా బ్రదర్స్ మధ్య కూడా గ్యాప్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన అన్నయ్య చిరంజీవి మీద బాలయ్య విమర్శలు చేస్తే నాగబాబు కానీ పవన్ కానీ ఇప్పటిదాకా నోరు మెదపకపోవడమేంటి ని మాజీ మంత్రు గుడివాడ అమర్నాధ్ ప్రశ్నించారు. ఈ వైఖరిని చిరంజీవి అభిమానులు అంతా గమనిస్తున్నారు అని ఆయన అంటున్నారు. వారు మెగాస్టార్ విషయంలో జరిగిన అవమానానికి కలత చెందుతున్నారు అని ఆయన అంటున్నారు.

చీలిక వస్తుందా :

ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కాపులు ఉన్నారు. దాదాపుగా పాతిక శాతం పైగా వారికి ఓటు బ్యాంక్ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని కాదని వీరంతా కూటమి వైపు వెళ్ళారు, దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణం. అయితే ఇపుడు మెగాస్టార్ చిరంజీవి అయితే జగన్ ని విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ గట్టిగా ఊపిరి పీల్చుకుంటోంది. ఇది తమకు ఎంతో కొంత అనుకూలంగా మారుతుందని ఒక బలమైన సామాజిక వర్గంలో కచ్చితంగా డివిజన్ వస్తుందని అది తమకు అనుకూలం అవుతుందని లెక్క కడుతోంది. నిజానికి మెగాస్టార్ రాజకీయాల్లో లేరు. ఆయన అతీతంగా ఉంటున్నారు కానీ ఆయన న్యూట్రల్ స్టాండ్ మంచిని మంచిగా చెప్పే తీరు తమకు ఈ కీలక సమయంలో ఉపకరిస్తుంది అన్నదే వైసీపీలో వినిపిస్తున్న మాట. అందుకే ఒక సెక్షన్ కి చెందిన మాజీ మంత్రులు అంతా ఉత్సాహంగా దూకుడుగా ఇపుడు కూటమి మీద బాణాలు వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ మెగా జపం మాత్రం ఆసక్తిగా ఆశ్చర్యకరంగా ఉంది అన్నది వాస్తవం.

Tags:    

Similar News