ఏపీలో మరో కూటమి.. చర్చలు షురూ!?
ప్రత్యేకంగా కొత్త కూటమి కట్టే విషయంలో కమ్యూనిస్టులు చొరవ చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన కు ముందు... కమ్యూనిస్టులకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉంది.
ఏపీలో మరో కూటమి అవతరించనుందా? వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న కూటమికి పోటీగా ఇది మారనుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. 2024 ఎన్నికల సమయంలో కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేనలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి. పైగా వచ్చే ఎన్నికల్లోనూ అంతే బలంగా ముందుకు సాగాలని కూటమి నిర్ణయించుకుంది. దీంతో ప్రస్తుతం ఉన్న కూటమి యేతర పార్టీలు ఒంటరి పోరాటం కంటే కలిసి నడిస్తేనే బెటర్ అన్న ఆలోచనకు వచ్చినట్టు గత కొన్నాళ్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
కమ్యూనిస్టుల చొరవ
ప్రత్యేకంగా కొత్త కూటమి కట్టే విషయంలో కమ్యూనిస్టులు చొరవ చూపిస్తున్నారు. రాష్ట్ర విభజన కు ముందు... కమ్యూనిస్టులకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రాబల్యం ఉంది. అయితే.. విభజన తర్వాత.. తెలంగాణలో పట్టు నిలుపుకొన్నప్పటికీ.. ఏపీలో కోల్పోయారు. సీపీఐ, సీపీఎంలు ఇప్పటి వరకు జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేయడమే తప్ప.. గెలిచిందే లేదు. 2019లో జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. ఫలితం దక్క లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు రెండేళ్ల ముందే కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
కలిసొచ్చే పార్టీలను కమ్యూనిస్టులు రహస్యంగా కలుస్తున్నారని తెలుస్తోంది. ప్రధానంగా వైసీపీ నేతలను ఓ కీలక కమ్యూనిస్టు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కలిశారని.. పొత్తు పెట్టుకు ని ముందుకు వెళ్దామని ఆయన సూచించినట్టు వైసీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. జగన్‌కు సన్నిహితుడై న సదరు నేత సూచనలను వైసీపీ కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కూటమిని చీల్చే ప్రయత్నం చేసినా.. అది ఫలించలేదు.
ఈ నేపథ్యంలో తాము కూడా ఓ కూటమిగా ముందుకు వెళ్లేందుకు జగన్ కూడా సుముఖంగానే ఉన్నారని వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. ''ఒంటరి ప్రయాణం మంచిదే. అయితే..కూటమిగా వెళ్తే మరింత తేలికగా.. విజయం దక్కించుకోవచ్చు'' అని కృష్ణా జిల్లా కు చెందిన మాజీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక, ఈ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంటుందన్న టాక్ వస్తోంది.
అయితే.. కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిలో ఉంటే వైసీపీ ఉండదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక, చిన్న చితకా పార్టీలు.. కూడా చేతులుకలిపి కొత్త కూటమి ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నది రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. మరి ఏం జరగుతుంది? ఈ కూటమి ఏర్పడుతుందా? లేదా? అనేది కొన్నాళ్లు వెయిట్ చేసి చూడాల్సిందే.