బేక్ టు ఫెవిలియన్.. ఆ నేతలు మళ్లీ వైసీపీలోకి వస్తారా?
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు, కేసులు, పదవులు, కంఫర్ట్ కోసం మరికొందరు టీడీపీ, జనసేనల్లో చేరారు.;
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో అప్పటివరకు ఆ పార్టీలో కీలకంగా పనిచేసిన వారు అధికార కూటమిలోకి జంప్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఈ వలసలు ఉండగా, ఆయా చోట్ల వైసీపీ ఇంతవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేకపోయింది. అయితే ఇప్పుడు వైసీపీని వీడిన కొందరు నేతలు తిరిగి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు ఇప్పటికే వైసీపీలో ఉన్న తమ సన్నిహితులతో సంప్రదింపులు జరపగా, మరికొందరు అధినేత జగన్ నుంచి పిలుపు వస్తుందని ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, పార్టీకి భవిష్యత్తు లేదని కొందరు, కేసులు, పదవులు, కంఫర్ట్ కోసం మరికొందరు టీడీపీ, జనసేనల్లో చేరారు. ఇలా వెళ్లిన వారిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను, కిలారు రోశయ్య, పెండెం దొరబాబుతో పాటు మరికొందరు ఉన్నారు. అదేవిధంగా పార్టీలో కీలక నేతగా పనిచేసిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయ సన్యాసం పేరిట పాలిటిక్స్ కు దూరమయ్యారు. అయితే ఇలా పార్టీని వీడిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు ఉదయభాను ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఆ పార్టీలో ఓదిగిపోగా, పిఠాపురంలో దొరబాబు యాక్టివ్ గా ఉంటున్నారు.
కానీ, మాజీ మంత్రులు బాలినేని, మోపిదేవి, ఆళ్ల నానితో సహా వలస వెళ్లిన నేతల పరిస్థితి కొత్త పార్టీల్లో ఏమాత్రం ఆశాజనకంగా లేదని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఆయా జిల్లాల్లో తిరుగులేని నేతలుగా చక్రం తిప్పిన నేతలు కూటమి ప్రభుత్వంలో ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా ద్వితీయ శ్రేణి నేతలుగా పరిమితమైపోయారని అంటున్నారు. ఈ పరిస్థితిని ఊహించడానికే ఇష్టపడని నేతలు, వారి అనుచరులు కూటమి పార్టీల్లో ఇమడలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో ముందుకెళితే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అన్నట్లు తమ పరిస్థితి మారిందని వైసీపీని వీడిన నేతలు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు చెబుతున్నారు. తమ సైకాలజీ, రాజకీయానికి టీడీపీ, జనసేన పార్టీల తీరుకు అసలు సెట్ కావడం లేదని కొందరు చెబుతున్నారు. వైసీపీలో అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాము ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు అనుచరుల వద్ద ప్రస్తావిస్తూ మదన పడుతున్నారని అంటున్నారు. కూటమిలో తమ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావిస్తే, ఇక్కడ ఆ చాన్స్ వస్తుందా? లేదా? అన్న టెన్షన్ ఎక్కువ మందిని పీడిస్తోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు వెనక్కి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.