వైసీపీ టాక్: అందుకే.. జగన్ ఇలా చేస్తున్నారా.. ?
ఈ పరిణామాలు.. వైసీపీలోచాలా కాలంగా ఉన్నా.. ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.
వైసీపీ అధినేత జగన్ వ్యూహం ఏంటనేది పెద్దగా ఎవరికీ తెలియదు. అసలు జగన్ వ్యూహాలు వేస్తారా? లేక.. అప్పటికప్పుడు అనుకున్నది చేస్తారా? అంటే.. రెండూ ఉంటాయని కొందరు చెబుతున్నారు. కాదు.. అప్పటికప్పుడు..ఆయనకు నచ్చింది.. చేస్తారని మరికొందరు చెబుతున్నారు. ఈ వాదనే ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. చాలా నియోజకవర్గాల్లో జగన్ వైఖరిని పసిగట్టలేని కొందరు నాయకులు.. మౌనంగా ఉంటున్నారు.
తమకు బాధ్యతలు ఇవ్వండి అని పలు నియోజకవర్గాల నుంచి నాయకులు అభ్యర్థిస్తున్నారు. కానీ.. చూస్తాం.. చేస్తాం.. ముందు మీరు ప్రజల మధ్య ఉండండి.. అని అధిష్టానం నుంచి కబుర్లు వస్తున్నాయి. అయితే.. ఈ మాటలను విశ్వసించి.. ప్రజల మధ్యకు వెళ్లి.. నియోజకవర్గంలో పార్టీని డెవలప్ చేస్తే.. తమకు టికెట్ ఇస్తారా? లేదా? అనేది సందేహం. ఒకవేళ ఇదే పరిస్థితి ఎదురైతే.. ఖర్చు పెట్టిన సొమ్మయినా వస్తుందా? రాదా? అనేది మరో డౌటు.
ఈ పరిణామాలు.. వైసీపీలో చాలా కాలంగా ఉన్నా.. ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రెడీ అవుతున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు.. నియోజకవర్గాల వారీగా నాయకుల ఆర్థిక పరిస్థితి.. జనంలో బలంవంటివి తరచి చూస్తున్నారు. దీనిని ఆధారంగా చేసుకుని.. పాదయాత్రకు ఎంత మేరకు జనాన్ని మొబిలైజ్ చేస్తారు? ఎంత మేరకు ఖర్చు చేస్తారు? అని లెక్కలు వేసుకుంటున్నారు.
ఇంతకీ.. జగన్ ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఇప్పటి వరకు పార్టీలో ఉండి. పార్టీ తరఫున పనిచేస్తున్నాం.. కదా అని నాయకులు నోరెళ్ల బెడుతున్నారు. కానీ.. దీనివెనుక జగన్ లాజిక్ వేరే ఉందని సమాచారం. బలమైన నాయకులు అంటే.. ప్రత్యర్థుల కంటే బలమైన నాయకులు అని ఆయన ఉద్దేశం. ఈ క్రమంలో నే నియోజకవర్గాల బాధ్యతలు.. పార్టీలో బాధ్యతలను అప్పగించేందుకు లెక్కలు చూసుకుంటున్నారని టాక్. అన్నీ సమపాళ్లలో సమకూరిన వారికే జగన్ మొగ్గు చూపుతారని అంటున్నారు. సో.. ఈ లెక్కలు అర్ధం కాక వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు.