నేత‌లు వ‌ద్దు-జ‌గ‌న్ ముద్దు.. వైసీపీ కి మంచిదేనా ..!

రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకులు సైతం ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.;

Update: 2025-08-21 06:30 GMT

రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకులు సైతం ఓడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వారు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఒక గెలుపు, ఒక ఓటమి నాయకులను ఎప్పుడూ నిర్దేశించ‌దు. గెలిచేందుకు ఉన్న కారణాలు అలాగే ఓటమికి దారి తీసిన పరిస్థితులను నాయకులు ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని ప్రజలకు చెరువ కావడం అత్యంత ముఖ్యం.

అయితే వైసిపిలో ప్రస్తుతం నెల‌కొన్న‌ పరిస్థితులను గమనిస్తే ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకు కూడా ఓడిపోయిన వారి పట్ల పార్టీ నాయకుల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వారి ఓటమికి వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు కారణమని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఓడిపోయిన వారు మాత్రం తాము అన్నీ పార్టీ లైన్ ప్రకారం చేసామని, పార్టీ అధినేత క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నామని చెబుతున్నారు. అయితే, వీరు చెబుతున్న‌ మాటల‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నేతలు వద్దు- జగన్ ముద్దు అన్న నినాదం జోరుగా వినిపిస్తోంది.

ఇటీవల చిలకలూరిపేట అదే విధంగా గురజాల, కొవ్వూరు వంటి కీలక నియోజకవర్గాల్లో ఇదే మాట వినిపించింది. నేతలపై స్థానిక నాయకులు తిరుగుబాటు జెండా ఎగుర‌వేశారు. అలాగని వీరు జగన్ కి వ్యతిరేకంగా కాకుండా స్థానికంగా ఉన్న నాయకులకు మాత్రమే వ్యతిరేకంగా వ్యవహరించడం వారివల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పడం విశేషం. అయితే, దీనిని పార్టీ అధిష్టానం ఇంతవరకు పట్టించుకోలేదు. అసలు ఏం జరుగుతోందో కూడా చూడటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఏర్పడుతుంది.

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని తట్టుకుని వైసిపి నిలబడాలి అంటే జరిగిన తప్పులు, నాయకుల్లో ఉన్న లోపాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా నాయకులే తప్పు చేశారని చెబుతున్న విధానంపై విశ్లేషణ చేసుకుని నిజంగానే వారు తప్పు చేసి ఉంటే సరిదిద్దాలి. ఒకవేళ వ్యతిరేకవర్గం ఉద్దేశపూర్వకంగానే నాయకులపై ఆరోపణలు చేస్తుంటే ఆ వ్యతిరేక వర్గాన్ని సరిదిద్ది సరైన దారిలో నడిపించాల్సిన అవసరం కూడా పార్టీ అధిష్టానం పై ఉంది.

కానీ, ఈ విషయంలో జగన్ కానీ పార్టీ కీలక నాయకులు గానీ చూసి చూడనట్టే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నాటికి అన్నీ సర్దుకుంటాయని వచ్చే ఎన్నికల్లో తనదే విజయం అని చెప్పుకుంటున్నారు. కానీ, వాస్తవం ఎప్పుడు నివురుగప్పిన నిప్పులా రగులుతూనే ఉంటుంది. ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో ఓడిపోయిన నాయకులపై పెరుగుతున్న వ్యతిరేకత చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పట్టించుకుని పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో మరింత వ్యతిరేకత పెరిగినా.. పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News