గూగుల్ సాక్షిగా వైసీపీ డిఫెన్స్ లో పడిందా ?
వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువగా చేస్తారు అని అంటారు. ఎంతలా అంటే తమ గురించి తాము చెప్పుకోవడానికి సైతం తీరుబడి లేనంతగా.;
వైసీపీ నేతలు విమర్శలు ఎక్కువగా చేస్తారు అని అంటారు. ఎంతలా అంటే తమ గురించి తాము చెప్పుకోవడానికి సైతం తీరుబడి లేనంతగా. అయిదేళ్ళ పాటు ప్రభుత్వాన్ని నడిపిన వారు మంత్రులు కూడా ఏ రోజూ పెద్దగా తమ శాఖల గురించి మాట్లాడింది లేదని విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో ఎంతసేపూ విపక్షాన్ని విమర్శించడమే ఆనాడు పనిగా పెట్టుకున్నారు. దాంతో అవే పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళాయి. ఫలితం అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి.
అయోమయంగానేనా :
వైసీపీలో నాయకులు దాదాపుగా ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు. అయితే ఈ మాటలలో అంతా ఒకే టోన్ వినిపిస్తే ఫర్వాలేదు. కానీ తేడా వస్తేనే పార్టీ ఇబ్బందులో పడుతుంది. ఉదాహరణకు తీసుకుంటే చంద్రబాబుని అసెంబ్లీలో అవమానించారు అన్న దాని మీదనే వైసీపీ నేతలు కొందరు ఒకలా మరి కొందరు మరోరకంగా మాట్లాడుతారు. ఆయనకు అవమానం జరగలేదని అలా ఎవరూ అనలేదని కొంతమంది అంటారు, జరిగింది అవమానం అలా జరగడం తప్పే అని మరి కొందరు అంటారు. అది ఎప్పటికీ తేలని వ్యవహారమే. అలాగే అమరావతి వంటి కీలకమైన రాజధాని విషయంలోనూ తలో రకమైన అభిప్రాయాలు చెబుతారు. ముఖ్య నాయకులే అమరావతి ఏకైక రాజధాని అని చెప్పకుండానే చెబుతారు. మూడు రాజధానుల విషయంలో తమ ఆలోచనలు మార్చుకుంటున్నామని కొందరు చెబుతారు. ఓటమి మీద కూడా భిన్నాభిప్రాయాలే చెబుతారు. కొందరు ఈవీఎంల వల్లనే ఓటమి అంటే మరి కొందరు అలా కాదని పార్టీని జనాలు ఎంత చేసినా ఓడించారని అంటారు, మరి కొందరు మూడు పార్టీలు కలవడం వల్లనే ఓడామని విశ్లేషిస్తారు.
గూగుల్ డేటా విషయంలో :
ఇక పాలనాపరమైన అంశాలు ప్రజలతో ముడిపడి ఉన్న విషయాలు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ప్రజల మూడ్ ని పార్టీ స్టాండ్ ని చూసుకుని మాట్లాడాల్సి ఉండగా కొందరు నేతలు మాత్రం అతి ఉత్సాహం చేసి మరీ జనాల్లో వేరే కలరింగ్ ఇచ్చారు. విశాఖకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అది కూడా అమెరికా దాటి ఎన్నో దేశాలను దాటి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి. అంతే కాదు, దేశంలో కూడా ఎన్నో రాష్ట్రాలను దాటుకుని వచ్చింది. అలాంటి ఘనమైన ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ ఏమి మాట్లాడాలో ప్రిపేర్ అయి మీడియా ముందుకు వచ్చిందా అన్నదే డౌట్ అని అంటున్నారు గూగుల్ డేటా ఒప్పందం సమయంలో జగన్ విదేశాలల్లో ఉన్నారు. అలా ఒప్పందం కుదరగానే ఇలా ఉత్తరాంధ్ర కు చెందిన వైసీపీ నేతలు అయితే పూర్తిగా వ్యతిరేక స్వరం వినిపించారు. గూగుల్ డేటా సెంటర్ అన్నది ఒక గొడౌన్ తప్పించి ఏమీ కాదని అన్న వారూ ఉన్నారు. ఇలా ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ప్రధాని స్థాయిలో ఆమోదించబడినది తమ ప్రాంతానికి వస్తూంటే వైసీపీ నేతల రియాక్షన్ ఈ విధంగా ఉండడమే కాకుండా జనాలలో కూడా ఆ పార్టీ వైఖరి పట్ల మరోసారి చర్చించుకునేలా అవకాశం ఇచ్చింది.
జై కొట్టిన జగన్ :
చిత్రమేంటి అంటే గూగుల్ డేటా సెంటర్ కి వైసీపీ అధినేత జగన్ జై కొట్టారు. ఆయన తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో గూగుల్ డేటా సెంటర్ గురించి బాగానే చెప్పారు. పైగా అది తమ హయాంలోనే రావాల్సిన ప్రాజెక్ట్ అన్నారు. అన్ని రకాలుగా తాము ప్రయత్నం చేశామని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టం తయారు అవుతుందని దాని ఫలితంగా మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు. అయితే క్రెడిట్ విషయంలోనే ఆయన కూటమితో విభేదించారు. తాము ప్రతిపాదించి ఒక దశ వరకూ తీసుకెళ్ళిన ప్రాజెక్ట్ ని అదానీ పేరుని కనీసమాత్రంగా చెప్పకుండా చంద్రబాబు కేవలం గూగుల్ అని చెప్పి కొత్త ప్రాజెక్ట్ గా చూపించారు అని జగన్ మండిపడ్డారు.
డిఫెన్స్ లో పడ్డారా :
జగన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో వైసీపీ నాయకులే డిఫెన్స్ లో పడ్డారని అంటున్నారు. తాము తీసుకుని రావాలనుకున్న డేటా సెంటర్ ఉందని కూడా మరచి విశాఖలో హై టెంపరేచర్లు పెరుగుతాయని ఏమీ పనికి రానిది డేటా సెంటర్ అంటూ విమర్శలు పెద్ద ఎత్తున చేశారు. తీరా జగన్ ఈ ప్రాజెక్టు వల్ల మేలు అని చెప్పడంతో అంతా ఆలోచించే పరిస్థితి అని అంటున్నారు. అధినాయకత్వం ఆలోచనలు పార్టీ స్టాండ్ ఏమిటో తెలుసుకోకుండా అయిన దానికీ కాని దానికీ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ పోతే తామే కాదు పార్టీ కూడా ప్రజలలో పలుచల అవుతోందని నాయకులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అని అంటున్నారు. పరిశ్రమలకు వైసీపీ వ్యతిరేకం అని కూటమి ఇపుడు పెద్ద గొంతుతో విమర్శలు చేస్తోంది అంటే వైసీపీకి ఏమి దక్కింది అని చర్చ సాగుతోంది.