వైసీపీలో సర్వేల కలవరం- సీటు విషయమేంటి ?
వైసీపీకి 2024 ఎన్నికలు అనేక విధాలుగా దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఇచ్చిన షాకులు చెప్పిన గుణ పాఠాలు చాలానే ఉన్నాయి.
వైసీపీకి 2024 ఎన్నికలు అనేక విధాలుగా దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఇచ్చిన షాకులు చెప్పిన గుణ పాఠాలు చాలానే ఉన్నాయి. వైసీపీకి చెందిన సిట్టింగులను అలా మార్చుకుంటూ పోయారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల నుంచి ఎవరినీ వదలేదు. అలా దాదాపుగా వంద దాకా అసెంబ్లీ నియోజకవర్గాలలో సిట్టింగులను భారీగా చేంజ్ చేయడం వల్ల వైసీపీ చివరికి ఇబ్బందుల పాలు అయింది. లాస్ట్ మినిట్ లో కొత్త చోట్లకు వెళ్ళడం వల్ల సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయారు. దాంతో దారుణంగా రిజల్ట్స్ వచ్చాయి. ఇక ఈసారి ఎక్కడి వారిని అక్కడే ఉంచుతూ ముందుగానే టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తారు అని ఒక వైపు ప్రచారం సాగుతోంది. అయితే మరో వైపు చూస్తే ప్రతీ అసెంబ్లీ సీటుకు ముగ్గురేసి మంది నేతల పేర్లు పరిశీలించాలని పార్టీ ఆలోచిస్తోంది అన్న వార్తలు అయితే పార్టీలో కలవరం రేపుతున్నాయని అంటున్నారు.
రెండేళ్ళ బట్టి అలా :
ఇదిలా ఉంటే వైసీపీకి ఇంచార్జిలను నియమించారు. వీరంతా రెండేళ్ళ బట్టి పనిచేస్తున్నారు. మరో మూడేళ్ళు కష్టపడితే తామే అభ్యర్ధులుగా పోటీకి దిగవచ్చు అన్న ఆలోచనలు వారికి ఉన్నాయి. కానీ ఇపుడు ప్రతీ నియోజకవర్గంలో ఆప్షన్లు పెట్టుకుంటూ పోతే చివరికి ఎవరికి టికెట్లు దక్కుతాయన్నది సందేహంగా ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీలో కీలక నేత మంగళగిరి నుంచి రెండు సార్లు గెలిచి వచ్చిన ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి ఈసారి టికెట్ దక్కుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అక్కడ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఆయన మీద గట్టి అభ్యర్దిని ఎంపిక చేయాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దాంతో ఆళ్ళను కాకుండా వేరే వారిని పోటీకి దించుతారు అని అంటున్నారు. మరి ఆళ్ళ లాంటి వారికే సీటు గ్యారంటీ లేదా అన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది.
ముందుగా ప్రకటిస్తేనే :
వైసీపీ విపక్షంలో ఉంది. దాంతో పార్టీని జనంలోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. తమకు ఉన్న ఆర్ధిక వనరులను ఇంచార్జులుగా ఉన్న వారి ఖర్చు చేయాల్సి ఉంటుంది. వారికి టికెట్ భరోసా కనుక కల్పించకపోతే వారు ఉత్సాహంగా పనిచేయరని అంటున్నారు. ఇక ప్రతిపక్షం పార్టీకి అడ్వాంటేజ్ కూడా ఉందని ముందుగా అభ్యర్ధులను ప్రకటించి రంగంలోకి దించితే వారు మరింతగా ప్రజలకు చేరువ అవుతారని అంటున్నారు. ఆ విధంగా బలమైన అభ్యర్ధులు అనుకున్న వారిని అలాగే కొనసాగించాలని అంటున్నారు. అంతే తప్ప ఆప్షన్లు పెట్టుకుని ముగ్గురు నలుగురుని అని చూసి చివరి వరకూ ఆలోచించి ఎవరో ఒకరిని ప్రకటించాలని చూస్తే అప్పటి దాకా పార్టీ కార్యక్రమాలు అనుకున్నంత ఊపుగా సాగవని చివరి నిముషంలో అభ్యర్ధులు అయిన వారు సర్దుకునే సమయం లేక ఆశించిన ఫలితాలు కూడా రావని అంటున్నారు. మరి అధినాయకత్వం అభ్యర్థుల విషయంలో సర్వేలు చేయిస్తోంది అన్న వార్తలు ఏ మేరకు వాస్తవం అన్నది ఒకటి అయితే అవే నిజం అయితే మాత్రం ఇబ్బంది అని పార్టీలో చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.