వైసీపీ బీఆర్ఎస్.... ఇదే లాస్ట్ చాన్స్ ?

ఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాయి.

Update: 2026-05-24 07:30 GMT

ఏపీలో వైసీపీ తెలంగాణాలో బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలూ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాయి. రెండూ ఒకే సమయంలో అధికారంలో కొనసాగాయి. అలాగే ఒకేసారి ఓటమిని అందుకున్నాయి. ఈ రెండు పార్టీల అధినాయకత్వాలకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వైసీపీ అధినేత జగన్ కి మంచి దోస్తీ ఉందని కూడా ప్రచారంలో ఉన్న మాట. ఇక రాజకీయ విధానాలు వ్యూహాలు ఆలోచనలు కూడా ఈ రెండు పార్టీలదీ ఒకేలా ఉంటుందని అంటారు. అదే సమయంలో ఈ రెండు పార్టీలూ పోరాడుతున్న అధికార పార్టీలు కూడా ఏపీ తెలంగాణాలలో విపక్షం మీద గట్టిగానే ఉక్కు పాదం మోపుతున్నవే కావడం విశేషం. ఏపీలో విశేష అనుభవం కలిగిన చంద్రబాబు నాలుగవ సారి సీఎం గా ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి తొలిసారి సీఎం అయినా డైనమిక్ గా ముందుకు సాగుతున్నారు.

ఎక్కడికక్కడ కంట్రోల్ :

ఏపీలో చంద్రబాబు వర్సెస్ జగన్ రాజకీయం చూస్తే వైసీపీని పూర్తిగా కట్టడి చేయాలన్న వైఖరితో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఆ దిశగానే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకూ వ్యూహ రచన సాగుతోంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త వ్యూహాలతో ఎత్తులతో టీడీపీ వైసీపీని చిత్తు చేసే విధంగా దూకుడు చేస్తూ వస్తోంది. ఒక నేరేషన్ కి జనంలో బిల్డప్ చేయడం ద్వారా వైసీపీ మీద నెగిటివిటీని క్రమబద్ధంగా పెంచే వ్యూహాన్ని టీడీపీ అధినాయకత్వం పక్కాగా అమలు చేస్తోంది. వైసీపీ అయితే రోటీన్ గా ఓల్డ్ ట్రెండ్ పాలిటిక్స్ నే నమ్ముకుంటోంది. దాంతో వ్యూహాల పరంగా టీడీపీది ఏపీలో పై చేయి అవుతోంది అని అంటున్నారు.

రేవంత్ జోరుగానే :

ఇక తెలంగాణాలో చూస్తే రేవంత్ రెడ్డి మంచి మాటకారి. అదే సమయంలో వ్యూహకర్త. ఆయన బీఆర్ఎస్ ఒకటి అంటే రెండు అన్నట్లుగా జోరు చేస్తున్నారు. ఎక్కడ ఏ మాత్రం గులాబీ పార్టీ కారు ముందుకు కదలకుండా తన శైలిలో పధక రచన చేస్తూ కట్టడి చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహాల పుట్ట అని వాగ్దాటిలో ఆయనకు సరిసాటి లేరని అంతా అనుకున్న తరుణంలో రేవంత్ రెడ్డి వచ్చి అతనిని మించిన ఘనుడిని అన్నట్లుగా తన రాజకీయ విశ్వ రూపానే చూపిస్తూ వస్తున్నారు. దాంతో బీఆర్ ఎస్ కారు కూడా అక్కడ నెమ్మదిగానే కదులుతున్న నేపథ్యం ఉంది.

ఇదే లాస్ట్ చాన్స్ :

ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు లోకేష్ తరచూ ఒకే మాట అంటూ వస్తున్నారు. వైసీపీకి ఒక్కటే చాన్స్ ఇచ్చారని అయిదేళ్ళ పాటు అరాచక పాలన చేసి జన విశ్వాసం కోల్పోయారని మరోసారి ఆ పార్టీకి అధికారం దక్కడం కల్ల అని కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. వైసీపీకి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అని మంత్రులు గొట్టిపాటి రవి కుమార్ లాంటి వారు సైతం చెబుతున్నారు. ఈ విధంగా వైసీపీ మీద సైకలాజికల్ గేం కి టీడీపీ తెర తీస్తోంది. అదే సమయంలో తెలంగాణాలోనూ బీఆర్ఎస్ కి 2023తోనే అధికారం పోయిందని ప్రతిపక్షమే శాశ్వతమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

ఒకే విధమైన జోస్యం :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే 2034 లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నారు. అంటే మరో రెండు ఎన్నికల్లో అన్న మాట. అంటే బీఆర్ఎస్ ఆశలు వదిలేసుకోవాలనే చెబుతున్నట్లుగా ఈ తీరు ఉంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇదే మాట అన్నారు. బీఆర్ ఎస్ కి పవర్ దక్కడం అన్నది జరగదని కుండ బద్ధలు కొట్టేశారు. ఇవన్నీ చూసినపుడు వైసీపీకి బీఆర్ఎస్ కి ఒకే విధమైన జోస్యాన్ని చెబుతున్నారు. మరి నిజంగా అలాగే జరుగుతుందా వైసీపీ కానీ బీఆర్ఎస్ కానీ అధికరంలోకి రాలేవా క్యాడర్ వీటిని ఏ విధంగా తీసుకుంటారు, వారు డీమోరలైజ్ అయితే పార్టీలకు ఇబ్బంది కదా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి మరి అటు కారు ఇటు ఫ్యాన్ రెండూ స్పీడ్ పెంచాలంటే చేయాల్సిన కసరత్తు చాలానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News