వైఎస్సార్ వీడియో వైరల్... బాలక్రిష్ణ వలన !

వైఎస్సార్ పాత వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఉమ్మడి ఏపీలో నిండు అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ మాట్లాడిన మాటలకు ఇపుడు మంచి రెస్పాన్స్ వస్తోంది.;

Update: 2025-09-26 06:52 GMT

వైఎస్సార్ పాత వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఉమ్మడి ఏపీలో నిండు అసెంబ్లీలో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ మాట్లాడిన మాటలకు ఇపుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. అదేంటి ఎపుడో రెండు దశాబ్దాల నాటి వీడియో ఇపుడు వైరల్ కావడం ఏమిటి దానికి అంత రెస్పాన్స్ రావడం ఏమిటి అనుకున్నా తప్పు లేదు. కానీ ఆ వీడియోలో వైఎస్సార్ మాట్లాడిన మాటలు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇపుడు చాలా రిలవెంట్ గా ఉండబట్టే అంతటి ఆదరణ దక్కుతోంది. ఏపీ అసెంబ్లీలో గురువారం బాలక్రిష్ణ వైఎస్సార్ తనయుడు ఏపీ మాజీ సీఎం జగన్ ని పట్టుకుని సైకో గాడు అంటూ చేసిన అనుచితమైన వ్యాఖ్యల వల్లనే ఇపుడు ఆ పాత వీడియో ప్రాణం పోసుకుని బయటకు వచ్చింది అన్నది వాస్తవం.

జగన్ మీద దారుణంగా :

అది నిండు అసెంబ్లీ. పైగా బాలయ్య తొలిసారి ఎమ్మెల్యే కాదు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, అంతే కాదు ఒక సినీ ప్రముఖుడు, అంతేనా నందమూరి వారి వారసుడు. ఒక మాజీ ముఖ్యమంత్రికి కుమారుడు, మరో ముఖ్యమంత్రికి స్వయంగా బావ మరిది కం వియ్యంకుడు, కీలక శాఖలు చూస్తున్న కూటమిలోని మంత్రి నారా లోకేష్ కి స్వయానా మేనమామ కం పిల్లనిచ్చిన మామ. ఇంతలా బాలయ్య చుట్టూ ఒక ఎత్తైన అంతస్తు అల్లుకుని ఉంది. అలాంటపుడు ఆయన మాట్లాడాల్సిన భాష కానీ చేయాల్సిన వ్యాఖ్యలు కానీ ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. వైసీపీ అధినేత జగన్ కూటమికి రాజకీయ ప్రత్యర్ధి కావచ్చు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా అయిదేళ్ళు పనిచేశారు. ఆయన కూడా ఒక మాజీ సీఎం కుమారుడు, ప్రజా నేతగా జనం గుండెలలో నిలిచిపోయిన వైఎస్సార్ తనయుడు. ఏపీలో ప్రతిపక్షంలో పెద్ద పార్టీగా వైసీపీ ఉంది. మరి ఏ విధంగా జగన్ ని పట్టుకుని సైకో గాడు అని బాలయ్య అనేస్తారు. పైగా తనకు ఫ్లాష్ బ్యాక్ లో ఆ కుటుంబం నుంచి ఘనమైన సాయం అందుకుని కూడా ఈ విధంగా అంటారా అని వైఎస్సార్ పార్టీ శ్రేణులు గత ఇరవై నాలుగు గంటల నుంచి సోషల్ మీడియాలో బాలయ్య మీద పోస్టులు పెట్టి హోరెత్తిస్తున్నాయి.

వైఎస్సార్ చేసిన సాయం అంటూ :

ఇక వైఎస్సార్ 2004 లో సీఎం గా ఉన్న సమయంలో బాలయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఒక సినీ నిర్మాత, ఒక జ్యోతీష్కుడు గాయాలపాలు అయి ఆసుపత్రిలో చేరారు అని అప్పడు జరిగిన విషయంలో ప్రముఖమైనవి. అయితే బాలయ్య అరెస్ట్ అవుతారు అన్నట్లుగా వచ్చిన ఆనాడు వార్తలు కేసు తీవ్రత నేపథ్యంలో అనూహ్యంగా బాలయ్య బయటపడ్డారు. ఆయన కొన్నాళ్ళు ఒక ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం బయటకు వచ్చారు. అయితే ఇదంతా ఆనాడు కాంగ్రెస్ సీఎం గా ఉన్న వైఎస్సార్ ఔదార్యంగా బాలయ్య విషయంలో వ్యవహరించబట్టే జరిగింది అని నాడూ నేడూ వైఎస్సార్ అభిమానులు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇపుడు జగన్ మీద సైకో గాడు అంటూ బాలయ్య విమర్శించడంతో పాత విషయాలు అన్నీ తవ్వుతూ బాలయ్య మీద గట్టిగానే విరుచుకుపడుతున్నారు వైఎస్సార్ అభిమానులు.

మేము రాజకీయ చేశామా అంటూ :

ఇదిలా ఉంటే ఉమడి ఏపీలో అసెంబ్లీలో వైఎస్సార్ మాట్లాడుతూ అసెంబ్లీలో అనేక అంశాలు చర్చిద్దామని చెబుతూనే బాలక్రిష్ణ ఇంట్లో తుపాకుల పేలి ఇద్దరు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిన సంఘటన మీద కూడా చర్చిద్దామని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ పాత వీడియోలో ఉన్నాయి. అంతే కాదు మేము రాజకీయం చేసే వారమా చంద్రబాబూ అని నిలదీస్తున్న వైఎస్సార్ ని చూడొచ్చు. తాము కనుక రాజకీయం చేయాలి అనుకుంటే బాలయ్య ఇంట్లో తుపాకుల పేలుడునే టార్గెట్ చేసుకునేవారం కదా అని వైఎస్సార్ అన్నట్లుగా వీడియోలో ఉంది. అదే చంద్రబాబు అయితే ఏ చిన్న ఇష్యూ ఉన్నా దానిని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తారు అని కూడా వైఎస్సార్ దెప్పిపొడిచారు.

బాలయ్యనే కార్నర్ చేస్తున్నారు :

తాము మాత్రం అలా చేయమని చెప్పుకుంటూ ఆయన దానికి ఉదాహరణగా బాలయ్య ఇంట్లో కాల్పుల ఇష్యూని బయటకు తెచ్చారు అని అంటున్నారు. ఇపుడు దానినే వైఎస్సార్ అభిమానులు అంతా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే బాలయ్య జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న కోపంతో ఎపుడో 2004లో జరిగిన బాలయ్య ఇంట్లో కాల్పుల కేసుని మళ్ళీ బయటకు తెచ్చి ఈనాటి తరానికి కూడా ఆనాటి విషయాలను చెప్పడం ద్వారా బాలయ్యనే కార్నర్ చేస్తున్నారు. మొత్తానికి ఇదంతా బాలయ్య మాటల తూలుడు వల్లే వచ్చిందని అంటున్న వారూ ఉన్నారు. ఎనీ వే వైఎస్సార్ పాత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన అభిమానులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Tags:    

Similar News