ఆస్తులపై వైఎస్ విజయమ్మ తాజా ప్రకటన ఎందుకంత సంచలనం?

ఆయన సోదరి షర్మిలకు మధ్య నడుస్తున్న ఆస్తుల పంచాయితీపై తాజాగా వైఎస్ సతీమణి కం ఇద్దరు పిల్లలకు తల్లైన విజయమ్మ ఆస్తుల అంశంపై తాజాగా విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది.;

Update: 2026-03-21 04:50 GMT

కోట్లాది మందిని ప్రభావితం చేసే ఒక రాజకీయ కుటుంబంలోని ఆస్తుల పంచాయితీ రచ్చకెక్కటం అరుదైన అంశం. ఎందుకంటే.. ఆ కుటుంబానికి ఉన్న ఇమేజ్ ను.. ఆస్తుల కారణంగా డ్యామేజ్ చేసుకోవాలని దాదాపుగా ఎవరూ భావించరు. అందుకు భిన్నంగా అప్పుడప్పుడు అరుదైన ఉదంతాలు చోటు చేసుకుంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి కం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిలకు మధ్య నడుస్తున్న ఆస్తుల పంచాయితీపై తాజాగా వైఎస్ సతీమణి కం ఇద్దరు పిల్లలకు తల్లైన విజయమ్మ ఆస్తుల అంశంపై తాజాగా విడుదల చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

ఆస్తుల కోసం ఇలాంటి పరిస్థితి అవసరమా? అన్న భావన కలిగేలా తాజా ప్రకటన ఉంది. ఇంతకూ ఈ ప్రకటన విడుదలకు నేపథ్యాన్ని చూస్తే.. ముందుగా చేసుకున్న ఎంవోయూలో భాగంగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లో వైఎస్ జగన్.. భారతి.. క్లాసిక్ రియాల్టీలకు చెందిన వాటాలను విజయమ్మకు కేటాయించారు. క్లాసిక్ రియాల్టీ నుంచి కొన్న వాటాలతో పాటు జగన్.. భారతిలకు కేటాయించిన వాటాలను తన పేరుతో బదలాయించాలని సరస్వతి బోర్డుకు లేఖ రాశారు.

అందుకు తగ్గట్లే విజయమ్మ పేరుకు వాటాలను బదలాయిస్తూ.. సరస్వతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం చేసింది. ఈ అంశంపై జగన్ తన పాత నిర్ణయానికి భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. అదేమంటే.. చెల్లిపై ప్రేమతో ఎంవోయూ చేసుకున్నానని.. ఇప్పుడా ప్రేమ లేని కారణంగా సదరు ఒప్పందాన్ని ఉపసంహరించుకున్నట్లుగా జగన్ వెల్లడించారు. రాజకీయంగా తనతో విభేదించటమే దీనికి కారణంగా పేర్కొన్నారు.

అంతేకాదు.. తన తల్లి విజయమ్మ పేరుతో వాటాల బదలాయింపు చెల్లదని ఆమె మీద కోర్టుకు వెళ్లారు. ఓవైపు తల్లి మీద ప్రేమ ఉందని చెబుతూనే మరోవైపు ఆమెపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం చెన్నైలోని ఎన్ సీఎల్ ఏటీలో పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా విజయమ్మ ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో పలు సంచలన అంశాలు ఉన్నాయి.

ఆస్తుల పంపకాల విషయంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశల్ని.. ఆశయాల్ని ఆమె వెల్లడించారు. అంతేకాదు.. ఎప్పుడూ కూడా ఆస్తుల పంపకం జరగలేదన్నారు. ఇంతకూ ఆమె ప్రకటన విడుదల చేయటానికి కారణమేంటి? అన్న విసయంలోకి వెళితే.. జగన్ కష్టార్జితంలో షర్మిల వాటా అడుగుతున్నారంటూ వైసీపీ నేతలు తమ పత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో ఆస్తుల వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే వీలుగా తాజాగా ఆమె నోటరీ ద్వారా బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్బంగా స్పష్టంగా.. సూటిగా వెల్లడించిన అంశం ఏమంటే.. ‘‘2009లో రాజశేఖర్ రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే’’ అని విజయమ్మ స్పష్టం చేశారు.

విజయమ్మ లేఖలో పేర్కొన్న అంశాల్ని ఆమె మాటల్లోనే చెబితే..

- వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఇవన్నీ వైఎస్ జగన్, వైఎస్ షర్మిల సంతానమైన మనవళ్లు.. మనమరాళ్లు నలుగురికీ సమానంగా పంచాలన్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయం. అదే సమయంలో ఆదేశం కూడా.

- షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశారు. మేనల్లుడు.. మేనకోడలికి జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నా.

- హైదరాబాద్ లో ఇళ్లు.. రూ.230 కోట్ల నగదు..ఇతర ఆస్తులు ఇచ్చినా జగన్ కష్టార్జితంలో షర్మిల వాటా అడుగుతున్నారని వైసీపీ నేతలు పత్రికల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు.

- 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఈ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. ఉన్న ఆస్తులన్నింటినీ మనమలు.. మనమరాళ్లు నలుగురికీ సమానంగా ఇవ్వాలన్నది వైఎస్సార్ ఆలోచన. అదే ఆయన ఆదేశం అన్నది ఆయన సన్నిహితులందరికి తెలుసు.

- సరస్వతి.. యలహంక భూమి కూడా షర్మిలదే. ఎంవోయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తీ న్యాయంగా ఆమె చెందాల్సిందే. అందువల్లే జగన్ ఎంవోయూ సిద్ధం చేశారు.

- వాస్తవానికి షర్మిలకు దక్కాల్సిన దాని కంటే జగన్ తక్కువగానే ఇచ్చారు. ఇప్పటివరకు షర్మిలకు ఇచ్చానని చెబుతున్న సొమ్ము ఆమె వాటాకు వచ్చిన డివిడెండ్ మాత్రమే. వైఎస్సార్ మరణం వరకు ఆస్తుల పంపకం జరగలేదు. షర్మిలకు ఇచ్చినట్లే.. జగన్ కు ఆస్తులు ఇచ్చాం. అది ఆస్తి పంపకం కాదు.

- నిజం ఏంటో నా దేవుడికి.. నా కొడుక్కి తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయటానికి మీరెవరు? ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్య ప్రచారం మానుకోవాలి. మళ్లీ మళ్లీ ఈ అంశాల్ని మీడియాలో ప్రస్తావించొద్దని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నా. ప్రకటనలో పేర్కొన్న అంశాలన్ని దేవుడి సాక్షిగా వాస్తవాలు.

Tags:    

Similar News