వైసీపీ వర్సెస్ వివేకా !
వైసీపీకి వివేకాకు రాజకీయ సంబంధం కంటే వ్యక్తిగత సంబంధమే ఎక్కువ. ఆయన జగన్ కి సొంత బాబాయ్. వైఎస్సార్ కి సొంత తమ్ముడు.;
వైసీపీకి ఎన్నో సమస్యలు మరెన్నో చిక్కు ముడులు ఆ పార్టీ నాయకులే చెప్పుకున్నట్లుగా సమస్యల నుంచి సంఘర్షణల నుంచి వైసీపీ పుట్టింది. ఈ రోజుకీ సమస్యలతోనే ఆ పార్టీ అలా ముందుకు సాగుతోంది అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీకి ఉన్న సమస్యలు కొని తెచ్చుకున్న సమస్యలు ఇలా అనేకం ఉంటూనే ఉన్నాయి వాటి నుంచి బయటపడేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందా లేక వాటితోనే ముందుకు సాగుతోందా అన్నదే ఒక సందేహంగా పేర్కొంటారు.
బాబాయ్ తోనే అంతా :
వైసీపీకి వివేకాకు రాజకీయ సంబంధం కంటే వ్యక్తిగత సంబంధమే ఎక్కువ. ఆయన జగన్ కి సొంత బాబాయ్. వైఎస్సార్ కి సొంత తమ్ముడు. దాంతో పాటు ఆయన కూడా రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహిస్తూ వచ్చారు. ఇక చూస్తే కనుక వైఎస్సార్ మరణించినపుడు వైఎస్ వివేకానందరెడ్డి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్ కాంగ్రెస్ ని వీడినపుడు ఆయన కాంగ్రెస్ ని అట్టిపెట్టుకునే ఉన్నారు. అదే పార్టీ ఆయనకు వ్యవసాయ మంత్రిగా అవకాశం ఇచ్చింది. ఆయననే వైఎస్ విజయమ్మ మీద కాంగ్రెస్ అభ్యర్ధిగా పులివెందుల నుంచి పోటీకి పెట్టింది. అలా వైసీపీకి ఆయన తొలి రోజులలో ఎదురు నిలిచే వచ్చారు.
వైసీపీలో సైతం అలా :
ఇక వైసీపీలోకి ఆయన 2014 ఎన్నికల ముందు వచ్చారు. ఆయన వైసీపీ విజయానికి ఆ ఎన్నికల్లో కృషి చేశారు అని చెబుతారు. ఇక 2016లో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ఓటమి పాలు అయ్యారు. ఇక 2019లో ఆయన మరోసారి వైసీపీ విజయానికి ప్రచారం చేస్తూనే దారుణ హత్యకు గురి అయ్యారు. ఈ హత్య ఎవరు చేశారు అస్మదీయులా తస్మదీయులా అన్న నిజాన్ని సీబీఐ నిగ్గు తేల్చలేకపోయింది. వైఎస్ వివేకాను హత్య చేసిన వారు అంటూ ఆయన కుమార్తె సునీత అయితే వైసీపీలోని కీలక నేతల వైపు వేలెత్తి చూపిస్తోంది.
కొలిక్కి రాని కేసుతో :
ఈ కేసు ఒక కొలిక్కి అయితే రావడం లేదు. శాఖాపరంగా తమ దర్యాప్తు పూర్తి అయింది అని సీబీఐ చెప్పవచ్చు కానీ రాజకీయంగా ఈ కేసు ఎప్పటికీ క్లోజ్ అయ్యేది ఉండదనే అంటున్నారు వైఎస్ కుమార్తె వేళ్ళు వైసీపీ మీద చూపిస్తున్నాయి. దాంతో వైసీపీకి తీవ్ర ఇరకాటంగానే ఉంటోంది. 2024 ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వైఎస్ షర్మిల సునీత చేసిన ప్రచారం మీద వైసీపీ మీద తీవ్రంగా విమర్శించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎంతగా నష్టపోయింది అందరికీ తెలిసిందే. ఇపుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చింది. దీంతో మరోసారి సునీత తన తండ్రి హత్యను గుర్తు చేసుకుంటూ వైసీపీ మీదనే ఘాటు విమర్శలే చేశారు.
వెంటాడుతున్న వివేకా :
వైసీపీని వివేకా ఒక విధంగా వెంటాడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓడింది. కానీ దారుణమైన పరాజయం పునాదులలో నుని బలంగా ఉన్న చోట సంభవించింది అంటే దానికి కారణం వివేకా హత్య కేసు అనే విశ్లేషిస్తారు ఈ విషయంలో వైసీపీ తన సత్య సంధతను ఎక్కడ నిరూపించుకుంటుందో తెలియదు కానీ ఆ పార్టీకి అయితే రాజకీయంగా మాత్రం ఇబ్బందులు తెచ్చేది గానే ఉంది. ప్రత్యర్ధులు రాయలసీమకు వచ్చినపుడల్లా ఈ హత్య కేసుని ప్రస్తావిస్తారు దాంతో వైసీపీకి ఇరాకాటంగానే ఉంటుంది అని అంటున్నారు. మరి వైసీపీ తన ప్రత్యర్ధులతో పోరాటం చేస్తోంది కానీ వివేకా రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం కనుగొనలేకపోతోంది. అలా కనుగొన్న నాడే వైసీపీకి పులివెందుల అయినా కడప అయినా రాయలసీమ అయినా పూర్తి పూర్వ వైభవం దక్కుతుందన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.