స్టేట్ పాలిటిక్స్‌కే షర్మిల పరిమితమా ..!
దీంతో ఇప్పుడు ఆమె తీవ్రంగా అవేదనలో కూరుకుపోయారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షర్మిల ఏపీకే పరిమితం కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు.. వైఎస్ షర్మిల రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కానున్నారా? ఆమె ఆశిం చిన రాజ్యసభ సీటు దక్కడం ఇప్పట్లో సాధ్యంకాదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా కర్ణాటక నుంచి రాజ్యసభలో వైఎస్ షర్మిల అడుగు పెడతారని.. దాదాపు పుష్కర కాలం తర్వాత.. పార్లమెం టులో వైఎస్‌కుటుంబం అడుగు పెడుతుందని.. గళం వినిపిస్తుందని భావించిన వారికి కాంగ్రెస్ అధిష్టా నం భారీ షాకే ఇచ్చింది.
వాస్తవానికి షర్మిల రాజ్యసభలో అడుగు పెట్టాలనేది 2019 ఎన్నికల తర్వాత రాజకీయంగా చర్చనీయాం శంగా మారింది. అప్పట్లో వైసీపీ తరఫున ఆమె రాజ్యసభలో అడుగు పెట్టాలని భావించారు. కానీ జగన్ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. దీంతో 2021లో తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడ సక్సెస్ కాలేకపోవడంతో దానిని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో ఆ పార్టీ పగ్గాలు చేపట్టారు. దీంతో మంచి గుర్తింపు లభిస్తుందని పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని షర్మిల అంచనా వేసుకున్నారు.
ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేశారు. కానీ పరాజయం పాలయ్యారు. ఇక అప్పటినుంచి ఆమె రాజ్యసభ సీటు కోసం ఎదురుచూస్తున్నారు. కర్ణాటకకు చెందిన కీలక నాయకులతో సిఫారసు కూడా చేయించుకున్నారు. దీంతో ఇటీవల పార్టీ అధిష్టానం షర్మిలను ఢిల్లీకి ఆహ్వానించి ఈ వ్యవహారం పై చర్చించింది. ఫలితంగా ఇక రాజ్యసభలో అడుగుపెడతారని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కానీ అనూహ్యంగా కర్ణాటక నుంచి కాంగ్రెస్‌కు లభించే మూడు స్థానాల్లో కూడా షర్మిలకు అవకాశం దక్కలేదు.
దీంతో ఇప్పుడు ఆమె తీవ్రంగా అవేదనలో కూరుకుపోయారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షర్మిల ఏపీకే పరిమితం కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఆమె ఏ విధంగా స్పందిస్తారు.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏ మేరకు కృషి చేస్తారు.. అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ వర్గాల్లో షర్మిల ఫైర్ బ్రాండ్ గా మారారు. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేయడంలో ఆమె బలమైన నాయకురాలుగా ఎదిగారు అనే చెప్పాలి.
ప్రస్తుతం టిడిపి చేస్తున్న `గొడ్డలి పార్టీ` అనే విమర్శ వెనుక షర్మిల ఇచ్చిన నినాదమే కారణమని చెప్పాలి. కొన్నాళ్ల కిందట షర్మిల మాట్లాడుతూ.. కడప జిల్లాకు `అవి గొడ్డలి` అని పేరు పెట్టుకోవాలని వైసీపీకి పిలుపునిచ్చారు. అనంతరం టిడిపి దీనిని అందిపుచ్చుకొని గొడ్డలి పార్టీగా ప్రచారం చేసింది. ఇలా షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో రాజ్యసభ సీటు గనక ఇచ్చి ఉంటే ఆమెకు మరింత బలం చేకూరేదన్న వాదన వినిపిస్తోంది. కానీ, పార్టీ మాత్రం తాజాగా ఆమెకు షాక్ ఇచ్చిందని చెప్పాలి. మరి ఈ షాక్ నుంచి తేరుకుని ఆమె పార్టీ కోసం పని చేస్తారా? లేకపోతే మౌనంగా ఉంటారా? వచ్చే ఎన్నికల దాకా వేచి చూస్తారా? అనేది చూడాలి.