ష‌ర్మిల హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల‌ను రాష్ట్ర పోలీసులు గృహ నిర్బంధం చేశారు.;

Update: 2025-04-30 08:22 GMT

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిల‌ను రాష్ట్ర పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే.. అరెస్టు చేయాల్సి ఉంటుంద‌ని విజ‌య‌వాడ పోలీసులు ఆమెకు నోటీసులు అందించారు. దీంతో ఇంట్లోనే ష‌ర్మిల‌.. నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపిన స‌మాచారం మేర‌కు.. వైఎస్ ష‌ర్మిల‌.. ఈ రోజు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించాల్సి ఉంది. వ‌చ్చే నెల 2న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అమ‌రావ‌తి ప్రాంతానికి రానున్నారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాక‌ను నిర‌సిస్తూ.. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న ఉద్ధండరాయుని పాలెంలో ష‌ర్మిల ప‌ర్య‌టించాల‌ని షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇక్క‌డి రైతుల‌ను కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం మోసం చేసింద‌ని.. వారికి అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలో మోడీ రావ‌డానికి ముందే రైతుల‌ను స‌మాయ‌త్త ప‌రిచి.. వారిని కూడ‌గ‌ట్టుకుని ఉద్య‌మించాల‌ని.. మే 2న విజ‌య‌వాడ నుంచి అమ‌రావ‌తి వ‌ర‌కు ర్యాలీ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్రమంలో ఉద్దండ‌రాయుని పాలెంలో బుధ‌వారం ఆమె ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మైన స‌మ‌యంలో పోలీ సులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. విజ‌య‌వాడ‌లోని ష‌ర్మిల నివాసానికి వెళ్లిన పోలీసులు.. ర్యాలీలు, స‌మావేశా ల‌కు అనుమ‌తి లేద‌ని తెలిపారు. అయితే.. ఆమె పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. తాను విజ‌య‌వాడ‌లో ఎలాంటి కార్య‌క్ర‌మం పెట్టుకోలేద‌ని.. ఉద్ధండ‌రాయుని పాలెం రైతుల‌తోనే చ‌ర్చించ‌నున్నాన‌ని.. తెలిపా రు.

కానీ, ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఎలాంటి అనుమ‌తులు లేవ‌ని పేర్కొన్న విజ‌య‌వాడ పోలీసులు.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దంటూ.. ష‌ర్మిల‌కు నోటీసులు జారీ చేశారు. అనంత‌రం.. 12 మందితో కూడిన బృందం ష‌ర్మిల ఇంటి ముందు శిబిరం వేసుకుంది. మ‌రోవైపు.. ష‌ర్మిల పిలుపుతో విజ‌య‌వాడ‌కు చేరుకున్న ప‌లువురు నాయ‌కుల‌ను కూడా పోలీసులు వెన‌క్కి పంపించారు.

Tags:    

Similar News