జగన్ సీరియస్ ....నేతలు లైట్ ?
వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల పట్ల సీరియస్ గానే ఉన్నారు.
వైసీపీ అధినాయకుడు వైఎస్ జగన్ స్థానిక సంస్థల ఎన్నికల పట్ల సీరియస్ గానే ఉన్నారు. పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి మేయర్ జెడ్పీ చైర్మన్ దాకా ఎక్కడా రాజీ వద్దు అంతా పేచీనే అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రతీ చోటా కూటమికి గట్టి పోటీగా వైసీపీ నుంచి అభ్యర్థి కచ్చితంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. ఏకపక్షంగా ఎన్నికలు కూటమి నేతలు చేసుకోవడానికి వీలు లేదని అన్నారు. ఏకగ్రీవాల ఊసు అంతకంటే వద్దు అని ఖండితంగా చెప్పారు. ఇక జగన్ లోకల్ బాడీ ఎన్నికల మీద ఎంత గట్టిగా ఉన్నారో చెప్పడానికి ఇప్పటికి అనేక సార్లు పార్టీ నేతలతో మీటింగ్స్ పెట్టారు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రతీ నియోజకవర్గం ఇంచార్జులు ఇలా అందరికీ కలిపి ఒకసారి విడిగా మరో సారి విడతల వారీగా మీటింగులు పెట్టి మరీ చెప్పాల్సింది చెబుతున్నారు.
నేతలు జారిపోతున్నారు :
అయితే అధినేత చెప్పిన దానికి నేతలు అంతా మీటింగులో అంతా బాగుందని చెబుతున్నారు. తీరా తమ నియోజకవర్గాలలో మాత్రం ఎన్నికల వ్యూహాల విషయంలో పెద్దగా ఆలోచిస్తున్నారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు అంటే సంస్థాగతంగా పార్టీలు గట్టిగా ఉంటేనే సాధ్యపడుతుంది. అలా బలంగా ఉన్న నాయకులను క్షేత్ర స్థాయిలో బలమున్న వారిని కూటమి పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చేర్చుకుని కండువాలు కప్పుతున్నాయి. దాంతో వైసీపీ పరిస్థితి చాలా చోట్ల చూస్తే గ్రామాలకు గ్రామాలు ఖాళీలు అవుతున్నాయని అంటున్నారు. తమ పార్టీ నేతలను జాగ్రత్తగా చూసుకుంటే వీలైతే ప్రత్యర్థి పార్టీల నుంచి ఆకట్టుకుంటేనే లోకల్ ఫైట్ హిట్ అవుతుంది అని అంటున్నారు. కానీ వైసీపీ చాలా చోట్ల పోటీకి వెళ్ళడం అటుంచితే ఆ గ్రామాలలో క్యాడర్ కూడా సమస్యగా ఉందని అంటున్నారు.
యాక్షన్ అంటున్నా :
ఇక్కడ మరో సంగతి కూడా ఉంది. అధినాయకత్వం యాక్షన్ కి కూడా సిద్ధమని హెచ్చరిస్తోంది. ఏ నియోజకవర్గంలో అయినా ఏకగ్రీవాలు జరిగితే ఆ ఇంచార్జి పదవికి ముప్పు వచ్చినట్లే అని స్పష్టం చేస్తోంది. అయితే ఈ హెచ్చరిక ఏ మేరకు పనిచేస్తోంది అన్నదే అర్థం కావడం లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే కూటమి ఏకపక్షాలకు తెర తీసేలా గ్రామాల నుంచి మండలాలు నియోజకవర్గాల స్థాయిలో బలమైన వైసీపీ నేతలను అక్కున చేర్చుకుంటోంది అని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక పెద్ద ఎత్తున ఏకగ్రీవాల మోత మోగించడానికి కూటమి వైపు నుంచి వ్యూహాత్మకంగా అడుగులు పడుతూంటే వైసీపీ జిల్లా స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో కూడా పార్టీని పరిరక్షించుకునే కార్యక్రమం సవ్యంగా చేపట్టలేకపోతున్నారు అని అంటున్నారు.
మరో వైపు వర్గ పోరు :
మరో వైపు వర్గ పోరు దాదాపుగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సంగతి తెలిసినా హైకమాండ్ పట్టించుకోకపోవడంతో వారంతా జెండా ఎత్తేసి మరీ వైసీపీని ఖాళీ చేస్తున్నారు. సొంత పార్టీలో ప్రత్యర్ధి వెళ్ళిపోయారు అని స్థానిక నేతలు సంబరపడుతున్నారా లేక ఎందుకొచ్చిన కొత్త తలనొప్పి అని మిన్న కుంటున్నారా అన్నది అయితే అర్ధం కావడం లేదని అంటున్నారు. మొత్తం మీద చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రాలేదు కానీ పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఆపరేషన్ ఆకర్ష్ పకడ్బందీగా సాగుతోంది. వైసీపీ నుంచి అయితే కీలక నేతలు ప్రత్యర్ధి శిబిరం బాటన పడుతున్నారని అంటున్నారు.