సీఈసీ జ్ఞానేశ్ కుమార్... ఎన్డీయే నుంచి కూడా సెగ

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ విపక్షాలకు గట్టిగానే టార్గెట్ అయ్యారు.

Update: 2026-09-26 03:14 GMT

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ విపక్షాలకు గట్టిగానే టార్గెట్ అయ్యారు. ఆయన రాజీనామాను వారు కోరుతున్నారు. అంతే కాదు అభిశంసనకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అలాగే సర్ ప్రక్రియ రూపేణా 13 కోట్ల దాకా ఓట్లు గల్లంతు అయ్యాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం సాగుతున్న సర్ ప్రక్రియను నిలిపేయాలని తిరిగి మొదటి నుంచి నిర్వహించాలని ఆ గల్లంతు అయిన ఓట్లు అన్నీ ఉంచాలని కూడా సరికొత్త డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్డీయే పెద్దన్న బీజేపీ అయితే పెద్దగా స్పందించడం లేదు, కానీ ఎన్డీయే మిత్ర పక్షాలకు ఇరకాటంగానే ఈ పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు. అందుకే కొన్ని మిత్ర పక్షాలు అయితే సీఈసీని వివరణ ఇవ్వాలని సూచించడం విశేషం.

దుమారమే రేగింది :

ఇదిలా ఉంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియకు సంబంధించి తలెత్తిన తాజా వివాదంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం జాతీయ స్థాయిలో రేగింది. విపక్షాలు మూకుమ్మడిగా సీఈసీ మీద అలాగే బీజేపీ అగ్ర నేతల మీద కూడా దాడి చేస్తున్నాయి. ఇక విపక్షాల విమర్శలు అయితే పీక్స్ కి చేరుకుంటున్నాయి. అనుచితమైన వ్యాఖ్యలను కూడా కొందరు నేతలు చేస్తున్నారు. అదే సమయంలో మీడియా ఎన్డీయే మిత్ర పక్షాల రియాక్షన్ ని కోరడంతో వారంతా ఇరకాటంలో పడుతున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అయితే దీని మీద తాను విమర్శించను సమర్ధించను అంటూ ఒక కొత్త వ్యాఖ్యను చేశారు. సమర్ధించను అనడం ద్వారా ఆయన సీఈసీ తీరు మీద పరోక్షంగా అసంతృప్తిగా ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఆయన ఒక మాట అన్నారు. విపక్షాలు రాజకీయ విమర్శలు చేస్తూనే ఉంటాయి, అది సహజం. వారి కోసం కాకపోయినా కోట్లాది మంది ప్రజల కోసం సీఈసీ వివరణ ఇవ్వాలని సూచించారు.

అనుమానాలు నివృత్తి చేయాలి :

ఇక కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ అయితే ఈసీ మీద వచ్చిన విమర్శల మీద తక్షణమే వివరణ ఇవ్వాలని ఎన్డీయే మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రక్రియ యొక్క పారదర్శకత పై ప్రజలలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీ పైనే ఉందని అంటున్నాయి. అసలు ఈ మొత్తం వివాదానికి ప్రధాన కారణం ఒక జాతీయ పత్రికలో వచ్చిన పరిశోధనాత్మక కథనం. దాని ప్రకారం చూస్తే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఓట్లను తొలగించారు. అయితే ఈ నిర్ణయాలతో మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిల ప్రమేయం లేదని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆ పరిశోధనాత్మక కధనంలో పేర్కొన్నారు. సర్ ప్రక్రియపై గత పది నెలల్లో ఇద్దరు ఈసీలు రికార్డు పూర్వకంగా 14 సార్లు తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ అంశం మీద స్పందించిన ఎన్డీఏ మిత్రపక్షాల నేతలు బహిరంగంగా స్పందించారు:

ఇది అవసరం అంటూ :

కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అయితే రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం సడలడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని స్పష్టం చేశారు. ఒక వేళ ఎన్నికల నిర్వహణపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తుంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్వయంగా ప్రజల ముందుకు వచ్చి తరఫున గట్టిగా వివరణ ఇవ్వాలని ఆయన సూచించారు. ఇక మరో ఎన్డీయే మిత్ర పక్షం ఆర్ ఎల్ ఎం నేత అయిన ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ సర్ ప్రక్రియ చుట్టూ జరుగుతున్న ఆరోపణలు ప్రజలలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయని అన్నారు. అందువల్ల ఈసీ తన వాస్తవ వైఖరిని త్వరగా స్పష్టం చేసి ఆ గందరగోళాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక కీలక మిత్ర పక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల సంఘం అనే కీలక వ్యవస్థ విశ్వసనీయతను కాపాడటానికి వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టత ఇవ్వాలని కోరినట్లుగా చెబుతున్నారు.

ప్రెస్ మీట్ పెడతారా :

ఈ నేపధ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని అంశాల మీద విపక్షాలు చేసే విమర్శల మీద సమగ్రమైన వివరణ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. నిజానికి ఈసీ మౌనంగా ఉంటే ఇవే విషయాలు జనంలోకి వెళ్ళిపోతాయని కూడా ఎన్డీయే మిత్రులతో పాటు అందరికీ ఉంది. ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం ఉంచడం ముఖ్యం. రాజకీయ విమర్శలుగా తేలికగా తీసుకోరాదని మేధావులు కూడా అంటున్నారు.

Tags:    

Similar News